పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/431

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

422

కాశీమజిలీకథలు - పదియవభాగము.

అని మహర్షులందఱు కలియుగ ప్రారంభమున నొకసభ జేసి కొన్నియాచారముల మార్పు గావించిరి. అందుఁగూడఁ బరస్పర మతభేదములు గలుగఁగా పరాశర మహర్షి వానికన్నిటికి సామరస్యము గల్పించి యొక ధర్మశాస్త్రము రచించెను. ఆగ్రంధస్థ విషయములు మును లందరు నొప్పుకొని తమతమ నెలవులకుఁ బోయిరి. అందుల కే (కలౌపారా శరీస్మృతిః) అని ప్రసిద్ధి గలిగినది.

చ. అని మణిసిద్ధుఁడెంతయు ప్రియంబున నారదమౌనిసార్వభౌ
    ముని చరితంబు దెల్పుటయు మోము వికాసమునొంద గోపనం
    దనుఁడు బళీ! సెబాసు గురునాయక ! యింతకుమున్ను మీరు దె
    ల్పిన కథ లింత చిత్రముగలేవుచుఁడీ పరికించి చూడఁగన్,

క. ఆనందంబయ్యె గదా
    మానసమున గురువరేణ్య ! మనకిఁక నాకా
    శీ నగరం బెన్నాళ్ళకుఁ
    గానంబడు నెపుడు మునుఁగఁగల మాగంగన్.

క. అన, లేలెమ్మిఁక నెలలో
   పునఁ బోవంగలము ముక్తిపురికిం బృధుకా
   ననమార్గమెల్ల దాటితి
   మనువుగ సులభములు ముందునగు పయనంబుల్.

అని చెప్పినంత సప్పుడే కావడియెత్తికొని గోపాలుండు వెంట నడుచుచు మహాత్మా! నారదమహర్షి చరిత్రము ఇంకను జాలనున్నదని చెప్పితిరిగదా ! అవ్విశేషములన్నియు మనము కాశీపురంబు జేరిన పిమ్మట సావధానముగా నెఱింగింతురుగాక. ఏమందురు? అని యడుగ నవ్వుచు నయ్యతిశిఖామఖి మౌనముద్రబూనియుండుట శిరఃకంపమున నంగీకారము సూచించుచు నడిచినడిచి క్రమంబున నవ్వలి మజిలీ చేరెను.