పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/426

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నారద పంచచూడా సంవాదము.

417

అంతకుఁడు, మృత్యువు పాతాళము, బడబాముఖము, కత్తిధార హాలాహలము, అగ్ని, సర్పము, వీని నన్నిటిని నొకదెసఁ ద్రాసులో వైచి రెండవ దెస స్త్రీని నెక్కించి తూచినచో వనితయే బరువుగా నుండును. గోవులు క్రొత్తక్రొత్త తృణములకై వెదకుచున్నట్లు స్త్రీలు క్రొత్తవానికై వెదకుచుందురు. ఈపంచభూతములు లోకములు స్త్రీ పురుషు లెప్పుడు సృష్టింపఁబడిరో యప్పటినుండియు స్త్రీలయం దీదోషములు నిరూఢములైయున్నవి.

శంబరుఁడు సముచి బలి కుంభీనసుఁడు మయుఁడులోనగు దానవు లెన్నిమాయ లెఱుంగుదురో యమాయలన్నియు స్త్రీలకు సహజములై యుండును. పెక్కేల స్త్రీలు అనృతమును సత్యముగాను, సత్యము ననృతముగాను జెప్పి వాదింపఁగలరు. సమస్త శాస్త్రవేత్తలగు శుక్ర బృహస్పతులుగూడ స్త్రీబుద్ధి నతిక్రమింపఁజాలరు.

మహత్మా! మఱియొకవిశేషము జెప్పెద వినుము.

శ్లో. ఉజ్జ్వలవపుషం పురుషం కామయతే స్త్రీనరోపి తాం దృష్ట్వా
    అనయోరేషవిశేషంః స్త్రీ కాంక్షతిధమన్‌నిరపేక్షా
    అభ్యర్థితాపి వుంసా సహసా నస్వీకరోతి సహజేన
    సుకృతసమయాద్య పేక్షీ ప్రవర్తతేవా నవా పురుషః

చక్కని పురుషుని చూచి స్త్రీలు చక్కని స్త్రీని జూచి బురుషుఁడును వరించుట సహజమనుకొనుఁడు. స్త్రీమాత్రము ధర్మాపేక్ష విడచి వరించును. ధర్మాపేక్షచే పురుషుఁడు సందేహించును.

సురమునీంద్ర! స్త్రీలు ఏదియో హేతువునుబట్టిగాని కేవలము ధర్మాపేక్షచే వరింపకుండరు. ఇదియే స్త్రీస్వభావమని యెఱింగించిన విని నారదుండు వంచచూడను మెచ్చుకొనుచు నెందేనిం బోయెను. అని యెఱింగించి మణిసిద్ధుండిట్లు. . . చెప్పందొడంగెను.


___________