పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/425

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

416

కాశీమజిలీకథలు - పదియవభాగము.

న్యాయముగా దనవుడు నారదుఁడు కలికీ ! అసత్యము చెప్పిన దోషము గాని యదార్థ కధనంబున ననర్ధ మేమియున్నది? వాక్రువ్వుమని యడిగిన నవ్వుచుఁ బంచచూడ యిట్లనియె.

మునీంద్రా! మీ రెఱింగియు నానోటినుండి పలికింపవలయునని యడిగితిరి. చెప్పెద వినుండు. మంచికులమున జనించినను స్తోత్రపాత్రమగు సౌందర్యము గలిగి నిరుపమ కళావిభవాభిరాముం డగు మగఁడు గలిగియున్నను స్త్రీలు సద్వర్తనముగలిగి యుండరు. ఇదియే స్త్రీల యందుఁగల దోషము సమస్తదోషములకు స్త్రీలునెలువులు సమర్ధులగు భర్తల విడిచి నీచులతోఁ గ్రీడింతు రింతకన్న నధమకార్య మున్నదియా?

మునీంద్రా! సమీపమందున్నవాఁ డెంత తక్కువవాఁడైనను స్త్రీ భజింపకమానదు. లోకాపవాదమునకు వెఱచి మనంబున నిష్టములేకున్నను భర్తలయెడఁ బడఁతుక లిష్టమున్నట్లు నటింతురు. కాని, ధర్మభీతి నాతికిలేదు. స్త్రీలకు భర్తలయెడ భయభక్తివిశ్వాసములు సహజముగానుండవు మహాత్మా! మీయొద్ద నిజము చెప్పుచున్నాను. స్త్రీలకుఁ బొందరానివాఁడు లేడు. ముమ్మాటికిని లేడు. ఇదియే పరమరహస్యము. భర్తలం దిష్టముగలిగి యతఃపురముల రక్షింపబడు పడఁతులును, నంధ, జడ, వామన, కుబ్జాదులతోఁ గలిసికొనుచుందురు. వనితయు, లతయు దాపుననున్నవానిపైఁ బ్రాకునను సామెత మీ రెఱింగినదియే.

ఎట్టి వనితయైనను బదిదినము లేకాంతముగా నొకవురుషునితోఁ గలిసి తిరిగినచో నది వానిం గలియకమానదు. సమిధలవలన నగ్నియు నదులవలన సముద్రుఁడు, భూతవధవలన నంతకుఁ డెట్లు తృప్తిబొంద కుండుందురో యట్లే స్త్రీలు పురుష శతమువలన దృప్తిబొందరు.