పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/423

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

414

కాశీమజిలీకథలు - పదియవభాగము.

మనసు తగులనీయఁడు. దేవినిం గోరఁడు. వచ్చినదానివలన సంతుష్టి నొందును. ఉంఛవృత్తివలన జీవనము గావించెను. తత్సుకృతమువలన సిద్ధార్థుండై మృతినొంది యిప్పుడు నన్నుఁగలిసెను. అని సూర్యదేవుఁడు మాకెఱింగించెను.

ఇదియే కడసారి నేనందుఁ జూచినవింత. ఇంతకన్న నేవిశేషము గనంబడలేదని పలికి మహాభాగా! ఇఁక మన మింటికిం బోవుదము రండు. విశ్రాంతి వహించిన పిమ్మట సావధానముగా నడుగ వలసిన యర్థ మడుగుదురుగాక! యుపవాసముల డస్సియున్నారు. రండని పలికిన విని సంతుష్టాంతరంగుఁడై భృగుండు సర్పపతికి నమస్కరించి యిట్లనియె.

భుజగేంద్రా! నీవలన వినవలసిన యర్థంబులం దెలిసికొంటి. పోయివత్తునని పలికిన విని చిలువఱేఁడు వెరగందుచు అయ్యో! ఇది యేమి పాపము! నావలన నేదియో తెలిసికొనవలయునని గంపెడాసతో వచ్చి యుపవాసముల డస్సి యిప్పుడు నేను వచ్చిన నన్నేమియు నడుగకయే యింటికిం బోయెదనందువేల? నామాటలు నాలుగు వినినంతనే నా యసమర్థత తెల్లమైనదియా యేమి? ఇందులకు నా డెందము సిగ్గు జెందుచున్నదని యడిగిన న ప్పుడమివే ల్పిట్లనియె.

ఫణిపతీ! నీమతి నట్లనుకొనరాదు. నీమాటలు వినుటచే నా సందియము దీఱినది. నీయుపన్యాసమే నాశంకకు సదుత్తరమైనది. కర్తవ్యము దిలిసికొంటి. సంశయము దీరినది. అని తానువచ్చిన పనికి విన్న విషయము సమాధానముగా నున్నదని పలికి నిజ మెఱింగించి యతని వీడ్కొని భృగుండు నిజనివాసంబున కరిగెను.

అని నారదమహర్షి యెఱింగించిన విని శుకుండు సంతసించుచు మహాత్మా! నీయుప దేశంబున నామనంబునంగల సందియముదీరినది. పోయివత్తు ననుజ్ఞ యిమ్మని పలికి యమహ్మర్షి యెందేనిం బోయెను.


___________