పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/422

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాగునికథ.

413

నియె. ఆర్యా! అట్టి పుణ్యపురుషు లనేకుల నిదివఱకుఁ జూచియుంటిని కాని మొన్నఁజూచినవింత యెన్నఁడును జూచియెఱుంగను. వినుఁడు.

ఒకనాఁడు సూర్యరథము వేగముగాఁ బోవుచున్నది. అప్పుడు భూలోకమునకు మధ్యాహ్న కాలము కావచ్చును. రవి దివ్యతేజోమయుండై వెలుఁగుచుఁ బోవుచుండ నా తేరికొక యద్భుత తేజ మెదురు వచ్చుచుండ మేము జూచితిమి. ఓహో! సూర్యు లిరువురు గలరా యేమి? ఆ తేజ మెక్కడిది? అని మేము వెఱగుపడుచుండ నా తేజము మా రవిబింబముచేరువునకు వచ్చినది. అప్పుడాసూర్యుఁడు అనిర్దేశ్యమైన యా తేజమును చేతులుసాచి తనరథముమీఁద కెక్కించుకొనియెను. ఆ రెండు తేజంబులం జూచి మేము రవియెవ్వఁడో క్రొత్తతేజ మెయ్యెదియో తెలిసికొనలేకపోయితిమి. ఇద్దరు సూర్యులువలెఁ బ్రకాశించుచుండిరి. కొంతసేపటి కా తేజము రవిబింబములో, గలిసిపోయినది. ఆవింత మేము గన్నులార జూచితిమి.

అప్పుడు మేము రవికి నమస్కరించి మహాత్మా! ఈవచ్చిన తేజ మెయ్యది? మీ తేజముతో సమానముగాఁ బ్రకాశించుచున్న దే మీలోఁ గలిసిపోయిన దేమి? దీని వృత్తాంతమంతయు జెప్పుమని యడిగిన నా లోకబాంధవుం డిట్లనియె. ఇతండు దేవుఁడుగాడు. అగ్ని కాడు, రాక్షసుఁడు కాడు. ఉంఛవృత్తివలన గాలము గడపిన యొకానొక బాహ్మణుఁడు. తానుజేసిన సుకృతమువలన నాలోఁ కలిసి ముక్తుం డయ్యెనని చెప్పిన మేమిట్లంటిమి. జగన్మిత్రా! ఈ ధాత్రీసురుఁ డెట్టి పుణ్యముజేసి మీలోఁ గలిసెనో చెప్పెదరా! అని యడిగిన సూర్యుఁ డిట్లనియె.

ఇతండు యజ్ఞయాగముల నేమియుం జేయలేదు. యాత్రల దిరిగి యెఱుంగఁడు. నిరాహారుండై దీర్ఘతపంబును జేయలేదు. వినుం డితండు త్రికరణముచేత భూతహితము గోరుచుండును. దేనియందును