పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/421

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

412

కాశీమజిలీకథలు - పదియవభాగము.

విశేషము లెఱింగింపుమని యడిగినఁ బద్మనాభుఁ డిట్లనియె.

భృగుప్రవరా! సూర్యునియందుఁగల విశేషములం జెప్పుటకు శేషునకైననుశక్యముకాదు. సూర్యరథమునకుఁగలవేగ మవాఙ్మాన సగోచరము. తత్తేజము తత్వసాధనంబునంగాని భరింపశక్యముగాదు. పర్వతములైనను రవిచెంతఁ జేరిన భస్మములైపోవును. మాకుఁ దదను గ్రహమునంజేసి సూర్యకిరణములు జల్లగానుండును. త్రాళ్లంటి వ్రేలాడువక్షులువలె రవికరసహస్రంబంటుకొని వ్రేలాడుచు వాలఖిల్యాది మహర్షులు తపంబుగావించుచుందురు. వేయికిరణములు వేయిరంగులుగా నొప్పుచుండును. కొన్నికిరణములు భూమియందుఁ గలజలమును లాగి యాకసమున నావిరిగా నెరయఁజేయును. కొన్నికిరణములు పగ్గములవలె భూమినాకిర్షించు చున్నవి. కొన్నికిరణములు వాయుపుతోఁ జేరి యావిరిని నీరుగావించి వర్షము గురిపించుచున్నవి. గ్రహతారకలతోఁగలిసి కొన్నికిరణములు పంటలుపండించుచున్నవి.

అక్కడి కీభూమియంతయు నొక చిన్న చుక్కవలెఁ గనంబడును. ఆతేజోరాశినిమించిన తేజము లేదు. తన్మండలమధ్యవర్తియై నారాయణుండు జగంబులం బాలించుచున్నాడు. ఓడమీఁదనున్న వానికి గమనవేగంబు దెలియనట్లు మాకందుఁ గుదుపుగాని తొట్రుపాటుగాని కనంబడదు. నిలువఁబడియున్నట్లే తోచును. కనంబడిన లోకములన్నియు దూరమగుచుండును. మాకు రాత్రింబగళ్ళు లేవుగదా. చక్రమువలెఁ దిరుగుచుండును. ఇట్టి విశేషము లనేకములున్నవి. ప్రొద్దు వోయినది. మనమింటికిఁ బోవుదములెండని పలికిన నాభూసురతిలకుఁడు వెండియు నిట్లనియె.

అయ్యా! సంగరములోఁ జచ్చినవారు పుణ్యపురుషులు, సూర్యమండలముమీఁదుగాఁ బోవుదురని పురాణముల వినియంటిమి. అట్టివారు మీకెవ్వరైనఁ గనంబడిరా? అని యడిగిన నురగపతి యిట్ల