పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/419

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

410

కాశీమజిలీకథలు - పదియవభాగము.

యిందు రాఁగలఁడని పలికిన విని యించుక నవ్వుచు నాసాధ్వీరత్న మిట్లనియె.

మనోహరా! ఆర్జవంబున నాబ్రాహ్మణుఁడు దేవుడు కాని నీయందుఁ బరమభక్తిగలవాఁడు. అతని కిందు వేరొకపనిలేదు. మేఘోదయమునుఁ జాతకంబువోలె నీయాగమన మభిలషించుచున్న వాఁడు. అందుల కేమివిఘ్నమువచ్చునో యని యడలుచున్నాడు. అతం డెట్టివాడైనను మిమ్మాశ్రయింప వచ్చెంగావున మీరు జాతిస్వభావజన్యమగు నహంకారము విడిచి యతనియొద్దకుం బోఁదగును. ఆశాఛ్ఛేదమున నాత్మను దహింపఁజేయకుఁడు. ఆశతోఁగూడికొన్నవాని నశ్రుప్రమార్జనము సేయక రాజైననేమి రాజపుత్రుఁడైననేమి? బ్రాణహత్యను బొందును. మౌనమువలన జ్ఞానఫలావాప్తియు దానంబునఁ గీర్తియు సత్యవాక్యంబున సర్వాధిక్యము నొందఁగలరు. న్యాయార్జనంబున లభించిన విత్తంబున నాశ్రమసమ్మతమైన భూదానఫలంబనుభవించునని బోధించిన విని యాయురగపతి యిట్లనియె.

సాధ్వీ! నేను మహామోహజనితిమగు నభిమానదోషంబున నే నిట్లంటి. సంకల్పమువలనఁ బుట్టిన నాదోషమును నీవడంచితివి. భుజగములకుఁ గ్రోధము సహజము. గర్వము సర్వగుణములను జెఱుచును. అభిమానము చెడ్డది. ఆహంకారమువలన రావణుఁడు కార్తవీర్యుడు లోనగువారు శత్రువులచేఁ జంపఁబడిరి. నీమాటలవలన నట్టిక్రోధ ముపసంహరించుకొంటిని. నీవంటిభార్య నాకు దొరకుటచే నన్ను నే బొగడుకొనుచుంటిని. నీమాటవడువున నేనా పాఱునొద్దకుఁ బోయెద. నతని కామితముదీర్చెదనని పలుకుచు నప్పుడే గోమతీతీరమునకరిగెను.

అందుఁ నేకాగ్రచిత్తముతో దనరాకకు వేచియున్న యాజన్ని గట్టుం గాంచి యోమహాభాగ! నీ వెవ్వఁడవు? యెందులకై యిందు వచ్చితివి? ప్రయోజనమేమి? స్నేహముచె నడుగుచుంటిఁ జెప్పుమని