పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/417

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

408

కాశీమజిలీకథలు - పదియవభాగము.

మీ కేకొరంతయు నుండదు. అక్కార్యంబు మావలనం దీఱునదియే యైనచో నుడువుఁడు. భ క్తితో నాచరించి కృతార్థులమగుదుముగాక. అని నివేదించిన విని యతం డించుక యాలోచించి యిట్లనియె.

సాధ్వీ! నీయాదరముననే నీసద్గుణంబులు వెల్లడియగుచున్నవి. నాకార్య మొరులవలనం దీఱునదికాదు. ఆతండే వచ్చి చెప్పవలయును. అతండు వచ్చుదనుక నాగోమతీపులినంబున వసించి తపంబు జేసికొనుచుండెద. వచ్చిన వెంటనే నాకుఁ దెలియఁజేయుము. ఇదియే నాకోరికయని పలికిన నాగేస్తురాలు. ఆర్యా! ఆతిథ్యమందుచు మా యింటనుండుము. వారు వచ్చి మీకార్యము దీర్తురుగాక. శీతవాతా తపక్లేశములు వహింపుచు నాయిసుకతిన్నెల నుండనేల! యని యడిగిన నతండు తల్లీ! నీయుల్లంబున మఱియొకరీతిం దలంపకుము. నీ యాతిథ్యమందితిని, నీయుపచారముల కానందించితిని. నేనీయెనిమిది దినములు భోజనము సేయను. తపంబు గావించుకొనుచు నందుండెద ననుజ్ఞయిమ్ము పోయివత్తునని బ్రతిమాలికొని యాయురగి నంగీకరింపఁ జేసి తత్తీరంబుజేరి నిరాహారుండై తపంబొనరించుచుండెను.

ఎవ్వఁడో బాహ్మణుండువచ్చి గోమతీసికతాతలంబున నన్నముతినక మలమల మాడుచున్నాడని విని యాయూరిలోనున్న వృద్ధ నాగు లాతిథ్యములుగొని యతనికడకుఁబోయి మహాత్మా! ఇది యేమి కర్మము? ఇది యూరనుకొంటివా? అరణ్య మనుకొంటివా? ఇందలి వారలు ధర్మశూన్యులని తలంచితివి కాఁబోలు. అతిధి యన్నముతినక మలమల వేగుచుండ శంకింపక గృహస్థులు కుడిచినచో నది మూత్ర పురీషసమమని యార్యులు సెప్పుదురు. పండ్లో పాలో కాయో కూరో మీరు భుజింప కిట్లుపవాసములు చేయుచుండఁ గుటుంబవంతులము మే మూరకొనిన నశింపమా? రండు. మీకిష్టమైనదాని భుజింపుఁడు మేము గృతార్థులమగుదుమని యెంతయో ప్రార్థించిరి. కాని యది