పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/416

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాగునికథ.

407

త్రియెల్ల నాయతిధితో ముచ్చటింపుచుఁ దృటిగా వెళ్లించెను. మఱునాఁడాయతిథి యెం దేనిం బోయెను. భృగుండును భుజగేంద్రదర్శన లాలసుండై శుభముహూర్తమున నిల్లువెడలి వనంబులు దాటి పర్వతంబు లతిక్రమించి నదీనదంబుల మీఱి క్షేత్రంబులం జూచుకొనుచు మార్గమధ్యంబున ననేక కష్టంబుల భరించి పోయిపోయి కొన్నిదినంబుల కా గోమతీతీరంబునకుం జని యురగనగరంబు బ్రవేశించి వీధులన్నియుం దిరిగి తిరిగి పద్మనాభుని గృహమడిగి తెలిసికొని వాకిటకుఁ బోయెను. తలుపు మూయఁబడియున్నది. వాకిట సందడి యేమియును లేదు. అతం డొక్కింత సేపాలోచించి మెలన తలుపు తట్టుచు, ఆయ్యా ! లోపల నెవ్వ రున్నారు ? తలుపు తీయుదురా ? అని కేక పెట్టెను.

ఆ కేక విని ధర్మవత్సలయగు నాగపత్ని వచ్చి తలుపుతీసి యావిప్రుఁజూచి యతిధిపూజ గావించి మహాభాగ! మీ రెవ్వరు ? ఎందుండి వచ్చితిరి ? మాయింట నేదేని బనియున్నదియా ? కామిత మెఱిఁగింపుఁడు. కావించి కృతార్ధురాలగుదునని యడిగిన నాభృగుండు తద్వినయవిశేషముల కచ్చెరువందుచు అమ్మా! నేను బ్రాహ్మణుండ భృగుండనువాఁడ. పద్మనాభుండను నాగపతిం జూడవచ్చితిని. అయ్యురగేంద్రునిగృహ మిదియేనా ! అతం డింటనున్నాడా ? అని యడిగిన నాయిల్లా లిట్లనియె.

ఆర్యా ! మీరాకచే మాగృహము పవిత్రమైనది. నేనా నాగపతి భార్యను. నాభర్త తనకు వంతురాగా సూర్యరథము గడుపుట కరిగిరి. సంవత్సరమునకొకసారి బోయి మాస మందు వసించి రావలయును. సూర్యరథహయంబులకుఁ బగ్గములుగా భుజగములఁ గట్టుదురని మీరు వినియేయుందురు. ఆయన యెనిమిదిదినములలో నిందు రాఁగలరు. అంతదనుక మీరిందు విశ్రాంతిగా నుండవచ్చును.