పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/415

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

406

కాశీమజిలీకథలు - పదియవభాగము.

దేశించియుండ నేది మంచిదో నిశ్చయించుటకు సమర్ధముకాక నామనస్సు సందేహడోలికయెక్కి యూగుచున్నది. వాయువుచేఁ దరళమగు మేఘమువలెఁ దొట్రుపడుచున్నది. అయిన నన్నడిగితివి కావున నీకొక్క యుపాయము సెప్పెద నాలింపుము. నేనిట్లే యడుగ నాగురుం డిది నాకుపదేశించెను. కాని యట్లాచరించుటకు సంసార సక్తచిత్తుండనగు నాకు నింకను నాగకున్నది. వినుము.

నైమిశారణ్యంబున గోమతీనదీతీరంబున నాగమను నగర మొప్పుచున్నది. అందు మాంధాత యనేకయాగములఁజేసి దేవతల నతిక్రమించియున్నవాఁడు, ఆఫదంబునఁ బద్మనాభుండను నాగాధిపతి గాపురము జేయుచుండెను. అయ్యురగపతి త్రికరణములచేత భూత హితము గోరుచుండును. చతురుపాయములచేత రక్షించుకొనుచుండును. అతండు సర్వధర్మములనెఱింగిన ప్రోడ. సర్వశాస్త్రవిశారదుఁడు. సర్వసుగుణములు నతనియందున్నవి. కృతాకృతముల నెఱింగినవాఁడు. తపస్సంపన్నుఁడు. పెక్కేల అతనియందు సద్గుణములన్నియు సంపూర్ణముగా నున్నవఁట. అతనికడకుఁ బోయి యడిగిన నీసందియములు దీర్పఁగలఁడని నాకుపదేశించెను. నేనిప్పుడు నీకామాటయే చెప్పుచున్నాను నీవందుఁబొమ్ము. నీసందియము దీరఁగలదని పలికిన విని పరమానందభరితుండై యాభృగుం డిట్లనియె.

మహాత్మా! నెత్తిపైనుండి పెద్దబరువు దింపినట్లు దారి నడిచి యలసినవానికి శయ్య గల్పించినట్లు దాహార్తునకు బానీయమిచ్చినట్లు క్షుధార్తునకు భోజనంబిడినట్లు వృద్ధునకు సుతుండు గలిగినట్లు వియోగమునుబొందిన మిత్రునిదర్శనమైనట్లు గ్రుడ్డివానికిఁగన్నులు వచ్చినట్లు తొట్రుపడుచున్న నాకు నీయుపదేశముననట్టి సంతోషము గలిగినది. తప్పక నీవుజెప్పినచొప్పున నామహానుభావు దర్శనమునకుంబోయెదం గాక. మంచిమార్గ ముపదేశించితివని సంతసించుచు భృగుం డారా