పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/413

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

247 వ మజిలీ.

నాగునికథ.

గంగానదీ దక్షిణతీరంబున మహాపద్మమను నగరంబున భృగుండను విప్రుండు గాపురము జేయుచుండెను. అతండు తపస్స్వాధ్యాయ నిరతుండు, జితక్రోధుండు, జితేంద్రియుడు, నిత్యతృప్తుండు, ధర్మనిత్యుండు, సజ్జనసమ్మతుండునై యొప్పుచుండెను. న్యాయప్రాప్తంబగు విత్తంబునఁ జిత్తం బలరించికొనుచు జ్ఞాతిసంబంధులచే విపులమగు కులంబున విఖ్యాతివడసి విశిష్టమగు వృత్తి నాశ్రయింపుచు ధర్మానుసారముగాఁ బుత్రులఁ బెక్కెండ్రఁ బడసి కాలక్షేపము జేయుచు నొక నా డాత్మగతంబున నిట్లు తలంచెను.

ఆహా! నాకిప్పుడు సగముప్రాయము గతించినది. ధనము సంపాదించితిని. వేదకర్మల యజ్ఞయాగాదులం గావించితిని. బంధువులఁ బోషించితిని. కాని మోక్షమునకు నిక్కమగుమార్గ మేదియో తెలియకున్నది. వేదము కర్మలఁజేయుమని యొక చోటను కర్మల వలనం బ్రయోజనము లేదని యొక చోటునం జెప్పియున్నది. వేదోక్తముశాస్త్రోక్తము శిష్టాచారము మూడును మూడు దారులుగా నున్నవి. మోక్షమునకు ముఖ్యమగుమార్గ మేదియో యెఱింగించుమహాత్ముఁ డెందైనం గలఁడేమో యని ధర్మనిశ్చయము జేసికొనలేక యతండు సంతత మాలోచించుచుండ నొకనాఁడొక విప్రుం డతనియింటి కతిధిగా వచ్చెను.

భృగుండు మిగుల సంతసించుచు భయభక్తివిశ్వాసములతో నతని కాతిథ్యమిచ్చి భుక్తోపవిష్టుండైన యాపాఱుని చేరువ నిలువంబడి తాళవృంతమున వీచుచు విశ్రాంతుండగుటఁ దెలిసికొని మెల్లననిట్లనియె. ఆర్యా! నీమాటలు వినుటచే నీవు ప్రాజ్ఞుండవని తెల్లమగు