పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/41

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

28

కాశీమజిలీకథలు - పదియవభాగము.

గలిగించితిరి? కరుణించి నాభర్తం బ్రతికింపుఁడు ఏమంటిరి ! పల్క రేమి ! ఔను సామంబున నెవ్వరు నుపకారము సేయరు కానిండు. ఇఁక నాప్రజ్ఞజూపించెదఁ గాచికొనుఁడు అరే! వేల్పులార ! మీరు యజ్ఞభాగములఁ గుడిచి మత్తిల్లి యొడలెఱుంగకున్నారు తృటిలో మీనోఁటియన్నము పడగొట్టెదఁ జూడుఁడు! దామోదరా? నీవు జగదీశుండవని యెఱుంగుదు నామొర విని నాపతిం బ్రతికింపక పోయితివి. ఇఁక నీగొప్ప నాకేమిటికి ? పతివియోగదుఃఖావేశంబున నేను యుక్తాయుక్త వివేకశూన్యురాలనై యున్నాను. నీయధికార మూడ నిన్నుఁ గూడ శపింపకమానను. చతురాస్యుఁడా! నీవిది వఱకే యపూజ్యుఁడవై యున్నావు, ఇప్పుడు నేను గావించు ననర్థము తెలిసికొనుము నీయధికార మూడఁబెఱికి కుండలుజేయు కుమ్మరవానిఁ జేయుదుఁ జూడుము. శంకరా! నీ పేరు నేతిబీరకాయవంటిదే యైన దేమి? నాకుఁ బతిసుఖము లేకుండఁజేయుదువా ! నీవు మృత్యుంజయుఁడవై యొరులకు మృత్యువు నప్పగింతువా ! నిన్ను జ్ఞాన శూన్యుఁజేయఁదలఁచుకొంటి నెఱుఁగుము. యముఁడా ! నీవు ధర్మరాజని పేరుపెట్టుకొంటివి. నీధర్మ మేమూల దాచితివి ! నాబతిం గడతేర్చితివే ! ఆయనధర్మ లోపమేమి గావించెనో చెప్పుము. నీకడ మృత్యువు గాలుడు నున్నారఁట వారినెల్లఁ గుటుంబముతో నాశనము జేసి లోకోపకారము గావించెద నిన్ను స్థానభ్రష్టుం గావింతు సూర్యచంద్రాదుల గతులెట్టుసాగునో చూచెదం గాక నిలువుఁడని పెద్దయెలుఁగునఁ బలుకుచు నమ్మహాపతివ్రత వారినెల్ల శపింపం దలంచి యురంబునుండి పతిశవంబు మెల్లన నేలంబరుండబెట్టి స్నానముజేయఁ గౌశికితీరంబున కరిగినది అప్పుడు,

చ. గడగడలాడె లోకములు గంపమునొందెఁ గులాచలంబులున్
    వడఁకె సమస్తదిక్కులును వార్థులుఘూర్ణిలెఁబంకిలంబులై