పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/406

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శుక నారద సంవాదము.

397

యున్నాఁడు. అదిగ్రహింపనేరక ఆసంసారమున సహితము హితముగాను, హితము సహితముగాను వాఁడబడును. అనిత్యము నిత్యమనియు, నరర్ధ మర్థమనియుఁ దలంపఁబడును.

తనయందుఁ బుట్టఁబడిన పలువిధములగు తంతువులచేఁ దన్నే చుట్టుకొను పట్టుపురుగువలె సంసారంబునఁ దనదోషములచేతనేచుట్టుకొనఁబడి బాధలం జెందుచుండును. చివరకుఁ బట్టుపురుగు తంతువేష్టితమై మృతినొందు. అట్లె పుత్రదార కుటుంబములయందు సక్తులై బురదలోఁ జిక్కుకొనిన యడవి యేనుఁగులవలె జంతువులు దుఃఖించు చున్నారు.

మహాజాలములచే లాగబడి మెరకజేరిన మత్స్యములవలె స్నేహజాలసమాకృష్ణులగుచు జను లెట్లు దు:ఖించుచున్నారోచూడుము. తనదేహమె యధ్రువంబగుచుండ బంధుమిత్రాదులు ధ్రువులాయేమి? సర్వమును విడిచి యెప్పుడో వెళ్ళదలఁచినవాఁడవే కదా! ఇట్టి యనర్ధకార్యమం దేమిటికి సక్తుండవయ్యెదవు? విశ్రాంతిశూన్యమై యాలంబరహితమై పాధేయముదొరకనిదై జీకటిచే నగమ్యమైయొప్పు మార్గంబునంబడి మరణానంతరమున నీవొక్కరుఁడ వెట్లుపోగలవు? మృత్యముఖంబునంబడి బయలుదేరి వెళ్ళునప్పుడు నీవెంట నీభార్యా పుత్రాదులలో నొక్కరుఁడు రాడని యెఱుంగుదువా? నీవుజేసిన సుకృత దుష్కృతములే నీవెంటవచ్చును. నిన్ను రక్షించినను భక్షించినను సుకృత దుష్కృతములే! నీ కెవ్వరును లేరు. నీ వెవ్వనివాఁడవునుకావు.

విద్యయు, గర్వము, జ్ఞానము, శౌచము, అర్థార్థమై యనుసరించును. వానిచే సిద్ధార్థుఁడు విడువఁబడుచున్నాడు.

నీకు గ్రామంబుననుండు తలంపు గలుగుట నది నీకు బంధన పుత్రాడునుమీ. ఉత్తముఁడు దానింద్రెంపిపోవుచున్నాఁడు. పాపులు దానిం ద్రెంపలేక కట్టుపడియుందురు.