పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/404

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

246 వ మజిలీ.

శుక నారద సంవాదము.

ఒకనాఁడు నారదమహర్షి యదృచ్ఛగా స్వాధ్యాయనిరతుం డగు శుకమహర్షి యొద్ద కరుగుటయు నమ్మునివరుం డతని నర్ఘ్యపాద్యాదివిధులనర్చించి సుఖోపవిష్టుండైన పిమ్మట నేదియోయడుఁగ దలంచి యతని మొగముపైఁ జూట్కులునెరయఁజేయుటయు నారదుం డతని యాశయము గ్రహించి యిట్లనియె. ధర్మజా ! నావలన శ్రేయస్కరమగు ధర్మ మేదియేని వినఁదలతువేని యడుగుము. నాయెఱింగి నంత వినుపింతు ననవుఁడు శుకమహర్షి మహాత్మా! ఈలోకమందు హితమైన దేదిగలదో యది నాకెఱింగింపుమని యడిగిన నారదుం డిట్లనియె.

వత్సా! పూర్వకాలంబునఁ దత్వాభిలాషులగు ఋషులకు సనత్కుమారుఁ డెఱింగించిన విషయంబులు గొన్నిగలవు. అవి ముముక్షుజన శ్రోత్రానందంబులైయుండు. వాని నెఱింగించెద నవ హితుండవై యాలింపుము. విద్యాసమంబగు చక్షువు సత్వసమంబగు తపంబు, రాగసమంబగు దుఃఖంబు, త్యాగసమంబగు సుఖంబు లేదని పెద్దలు సెప్పుదురు. పాపకర్మలయందు నివృత్తి, పుణ్యకర్మలయందుఁ బ్రవృత్తియుఁ గలిగియుండుట శ్రేయము. సుఖలేశ శూన్యముగు మానుషజన్మ మెత్తుట కెవ్వఁ డుత్సహించునో వాఁడే మోహమును బొందువాఁడు. దుఃఖము సంయోగమువలన వచ్చును. సక్తునియొక్క బుద్ధి మోహజాలమును బెంపుజేయును. మోహయుక్తుఁ డిహపరముల యందు దుఃఖమునుబొందును.

శ్రేయస్కాముఁడగు వాఁడు సర్వోపాయములచేతను గామ క్రోధముల నణుఁచు ప్రయత్నము చేయుచుండవలయును. మఱియుఁ గ్రోధమువలనఁ దపస్సు, మత్సరమువలన సంపద, మానావమాన