పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/403

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

394

కాశీమజిలీకథలు - పదియవభాగము.

పుటంబిడిన బంగారమువలె నీవీతపఃకరణంబునఁ బరిశుద్ధుండవైతివి. నీగుణములన్నియు నశించినవి. త్రిమూర్తులకుఁగూడ గుణములున్నవి. నాఁటి యవస్థననుసరించి నిన్నట్లనవలసి వచ్చినది. ఇప్పుడు నీవు సర్వసముఁడవైతివి. త్రిమూర్తుల పత్నులేకాక యింద్రాణి ప్రభృతి దేవ కాంతలు నీకడ సిగ్గుపడరు. ఎవ్వరి యంతఃపురమునకరిగినను నీకాటంకములేదు. వారివారి సెలవులతోఁబనిలేదు. నిష్కాముఁడవగు నిన్ను జూచిన నెవ్వరికిని సందియము గలుగదు. సర్వమహర్షులందే కాక మద్భక్తులలో నీవే యగ్రగణ్యుఁడవైతివి. ఎల్లలోకముల స్వేచ్ఛా విహారములు సేయుచుందువుగాక. సమస్తపురాణములు నీముఖంబున వెలువడఁగలవు. తత్వజ్ఞుండవన నీకే చెల్లును. నీవెఱంగిన తత్వరహస్యములు దేవతలుగూడ దెలిసికొనఁజాలరు. నీయన్నలు సనకసనంద నాదులకన్న నీకే యెక్కవ ఖ్యాతిరాఁగలదు. అని యెన్నియో వరములిచ్చి విష్ణుఁడు నారదమహర్షిని సంతోషపఱచె.

పిమ్మట బ్రహ్మయు శంకరుండుగూడ నతనికి సర్వాధికుఁడగు నట్లు మఱికొన్నివరము లిచ్చిరి. అట్లు సమస్తదేవతాసమూహముచే సర్వమునిసార్వభౌముండని కీర్తింపఁబడి నారదుండు వారికెల్ల వంద నంబులొనరించి శ్రీహరిం బెద్దగా స్తుతియించెను.

బ్రహ్మాదిదేవత లమ్మహర్షిని దీవించి తమతమ నెలవులకుఁ బోయిరి.

అని యెఱింగించి – మఱియు నిట్లనియె.


___________