పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/402

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నారదుని స్వస్వరూపప్రాప్తి.

393

శా. వత్సా! నారద! లెమ్ము నీవిటుల దుర్వారజ్వలద్వహ్ని భూ
    భృత్సాదృశ్యముగాఁ దపంబుసలుపన్ భీతిల్లె లోకంబు లా
    పత్సమ్మగ్నములై వచింపుము భవద్వాంఛా విశేషంబుల
    త్యుత్సాహంబున నీయవచ్చితిమి దివ్యుల్ గొల్వ మేమీయెడన్.

గీ. ఇతఁడు మీతండ్రి బ్రహ్మ గిరీశుఁ డీత
   డితఁడు సురపతి వీ రెదిక్పతులు వీరు
   వాగ్రమా పార్వతులు వింధ్యవాసినియును
   వరములీయంగ నీకిందు వచ్చినారు.

ఏను వాసుదేవుండఁ దపంబు చాలించి నీకోరికల దెలుపుమని పలికిన విని నారదుండు కన్నులందెరచి యెదుర సర్వలోకాధి పతులఁ ద్రిమూర్తుల సకలదేవతాసమూహములఁ గనుంగొని మేనం బులక లుద్భవిల్ల వారికెల్ల నమస్కారములు గావించుచు నారాయణు నుద్దేశించి యిట్లనియె.

మహాత్మా ! నాయభీష్టంబుదీర్ప నిప్పటికి దయవచ్చినదియా ? నాకడకు నీభార్య లక్ష్మింగూడ దీసికొనివచ్చితి విది వింతగానున్నది. నేనా మహాదేవి దర్శనముసేయ నర్హుండనైతిగా. నన్ను నాఁడు నీవాఁడుదానింజేసి యనేక మాయావిలాసంబులం జూపితివి. జ్ఞాపక మున్నదియా. అయ్యవమానంబు బాధింప నీ ఘోరతపంబు గావించితిని. నాకేకోరికయునులేదు. మాయను జయించుటయే నాయుద్దేశము. నన్ను జితమాయుండనని మీరెల్ల నొప్పుకొందురేని యీతపంబు సాలింతు లేకున్న నింకను ఘోరముగాఁ గావింతు నిదియే మదీప్సిత మని పలికిన విని సంతసించుచు నారాయణుం డిట్లనియె.

మునీంద్రా ! నీవిప్పుడు జితమాయుండ వైతివనుట కేమియు సందియము లేదు. మాయాస్వరూపిణియగు మూలప్రకృతి యాదిశక్తి యిదేవచ్చి నీకడనిలిచి నీకు వశవర్తినినైతినని సూచించుచున్నది.