పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/400

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నారదుని స్వస్వరూపప్రాప్తి.

391

నేను మునులలోఁ గడుహీనుండనైతిని. పామరుండనైతి గానిమ్ము. నాకిదియొక ప్రారబ్ధకర్మ మగుంగాక. ఇటుపైన నాప్రజ్ఞ జూతురుగాక. నేను జితమాయుండనై త్రిమూర్తులనుగూడ మాయా బద్ధులం గావింపఁజాలక పోయినచో నన్నీ పేరఁ బిలువకుడు. ఇందులకు నీవు నాకొక యుపకారము గావింపవలయును. దక్షుండు నన్నొకచో నిలువకుండునట్లు శపించియున్నాఁడు. అక్కార్యంబు తపంబునకు విఘ్నప్రదంబు కావున నేను తపంబుగావించునంతకాలము నన్నా శాపదోష మంటకుండ వరంబిమ్ము. ఇదియే పదివేలనికోరిన బ్రహ్మ సంతసించుచుఁ బుత్రు నాలింగనంబు జేసికొని యిట్లనియె.

పుత్రా ! నిన్ను సంసారిగాఁజేయు తలంపుతో మొదటినుండియు నీతపంబున కంతరాయము గల్పించితి. నీవు రెంటికిం జెడిన వాఁడవైతివి. కానిమ్ము. నీయభీష్టము వడువునఁ దపంబు గావించి సర్వోత్కృష్టుఁడవు కమ్ము. నిన్ను దక్షశాపంబంటకుండ వరంబిచ్చితిఁ బొమ్ము. తపంబు సర్వకార్యసాధనమని యనుజ్ఞయిచ్చుటయు సంతసించుచు నారదుఁడు తండ్రియాజ్ఞ గొని ధరిత్రినతిపవిత్రమైన బదరికారణ్యమునకరిగి యందు నియమిత చిత్తుండై ,

చ. తరణికరప్రహేతిపరితప్త నిదాఘమునందుఁ బావకాం
    తరమున నభ్రఘోషభయదంబుల వార్షిక రాత్రులందు బీ
    తర బయలన్ హిమంబుగురియన్ వడకించెడు శీతకాలమం
    దరుదుగఁ గంఠదఘ్నజలమందు వసించి మునీంద్రుఁడుద్ధతిన్ .

నిరాహారుండై దక్షిణపాదాంగుష్ఠంబుననిల్చి యచలంబువోలెఁ గదలక యనేక సహస్రదివ్యవర్షంబు లత్యుగ్రతపంబు గావించుటయుఁ దన్మూర్థాంతరంబునుండి వెల్వడిన జ్వలనంబు ప్రజ్వలజ్జ్వలా భీలంబై ప్రళయానలంబు పగిది జగంబులఁ పీడింపఁ దొడంగినది. మణియు,