పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/40

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మాలావతికథ.

27

అక్కలికి యతని ముఖవికారంబు జూచి వెఱచుచు అక్కా! మాలావతీ ! యిటురా. మన మనోహరుఁడు ఇట్లున్న వాఁడేమి ? కన్నులకళదప్పినదే! రమ్మురమ్ము. అని కేకలు వేయుటయు మాలావతి వడిగా వచ్చి చూచి గుండె బాదుకొనుచు అయ్యో ! ఇదియేమి పాపము! ఇప్పుడేకాదా మన కీవినోదములఁ జూపుచుండెను. ప్రాణనాధా ! ఉపబర్హణా ! అని పెద్దయెలుంగునం బిలిచినది. ప్రత్యుత్తరమువడయక యతండు మృతుం డయ్యెనని తెలిసికొని యురము మోదుకొనుచు నేలంబడి మూర్ఛవోయినది. తక్కినకాంతలందఱు. చుట్టుకొని హాహాకారరవంబులతో విలపింపఁదొడంగిరి.

అక్కాంత కొంతసేపటికి లేచి యతనిమోము జూచుచు లేవనెత్తి యురంబున వైచికొని యవయవముల ముట్టుచు గడ్డముపట్టుకొని జీవితేశ్వరా ! యొక్క సారి మాటాడుము. అమృతమును దిరస్కరించు పలుకుల మమ్మొకమాటు అలరఁజేయుము హా! విదగ్ధ రసికప్రవరా ! హా సుందరమూర్తీ ! హా విష్ణుభక్తాగ్రేసరా ! మమ్ము విడిచియరగడియ తాళకుందువే అయ్యో, నీవియోగమెట్లు సైతుము మాలతీలతావిలసితములగు గంధమాదనశైలతటంబుల మలయపర్వతంబున జందనప్రవాళ తల్పంబుల మనోహరసరస్సికతాతలంబులఁ గోకిలలు గూయ నీవు గావించిన రహః క్రీడలెట్లు మఱచువారము ? అక్కటా! ఇంతలో మాకీవంతవచ్చునని యెఱుఁగకపోతమే. స్త్రీలకు బతివియోగము కన్న దారుణమగు విపత్తి మఱియొకటి లేదుగదా. ఇతర దుఃఖము లెన్ని యైనఁ బతింగలసికొనిన నట మటయైపోవును. అని దుఃఖించుచు నంతలో నత్తలోదరిశోకోన్మత్తయై తత్తరముతో నాకసమువంకఁ జూచి యంజలివట్టి యో దేవతలారా ! ఓదిక్పతులారా! త్రిమూర్తులారా ! మీరు మీభార్యలతో నెట్లు సుఖింతురో నాభర్త నాతోనట్లు సుఖింపరాదా ! ఈవియోగమేమిటికి