పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/399

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

390

కాశీమజిలీకథలు - పదియవభాగము.

విశేషములఁ దెలిసికొనఁజాలము. ఇతరులమాట జెప్పనేల? గుణత్రయముచే స్థావరజంగమాత్మకమగు జగంబు జనించినది. గుణము లేక సంసారము గలుగదు. గుణములేనివాని నేనిదివఱకుఁ జూచియుండలేదు. వినలేదు. నేను జితమాయుండనని పలికితి వందులకై నీ మాయాబలము జూపితిని. తెలిసినదియా? అని యడిగిన నారదుండు సిగ్గుపడుచు హరికి నమస్కరించి యతని వీడ్కొని తిన్నగా బ్రహ్మ లోకమున కరిగి తండ్రికి నమస్కరించె.

క. మునిఁగనుఁగొని చతురానను
   డనురాగముతోడ నిట్టులను నీమోముం
   గనఁ జిన్నవోయియున్నది
   తనయా! యెఱిఁగింపు నువిదితనయా! యనినన్.

నారదుండు తండ్రీ! నామోహమునకంతయు నీవే కారకుండవు. నాయవమానమేమని చెప్పుకొందును ? పుట్టినతోడనే జ్ఞానమార్గ ముపదేశింపుమని కోరికొనినఁ గోపించి గంధర్వజన్మ మెత్తించి పెద్ద కాలము ఏబదుగుర భార్యలతో గ్రామ్యధర్మముల ననుభవింపఁజేసితివి. తరువాత దాసీపుత్రుం జేసితివి. అంతటితో విడువక సృంజయుని పుత్రికతోఁ గూర్చితివి. పిమ్మట నేను హరిభక్తుండనని పేరు పెట్టుకొని వైకుంఠమున కేగఁగా నన్ను విటాధమునిగా దలంచి కమల జాటునకుఁబోయినది. అందులకు వగచుచు శ్రీవిష్ణునితోఁ జెప్పఁగా నతండు పామరునకుఁబోలెనది మాయాబలము. పతివ్రత పరపురుషులకడ నిలువరాదని ధర్మములు బోధించెను. నీ పెద్దబిడ్డలు సనకసనందనాదులరిగిన లక్ష్మీదేవి చాటునకుం బోఁగలదా ! విష్ణు డట్లు జెప్పగలఁడా ? నాకర్మము. నన్నధమాధమునిఁగాఁ దలంచి యాఁడుదానింజేసి యనేక నీచకృత్యములు చేసినట్లు పన్ని నాకుఁ దగనియవమ మానము గావించెను.