పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/398

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నారదుని స్వస్వరూపప్రాప్తి.

389

తలంచికొనిన సిగ్గగుచున్నది. స్వామీ ! నిజముగాఁ దాళధ్వజుఁ డున్నాడా ? అతఁడు నావంటివాఁడేనా? అతండు నన్నుగురించి యుగ్గడించిన చర్యలన్నియు నేను గావించినవియే. అవి యన్నియు నిప్పుడు జ్ఞాపకమున్నవిగదా! నేను నారీదేహసంస్థుఁడ నైనప్పుడు నారదదేహ వృత్తాంతమేమియు జ్ఞాపకము లేదేమి? మనస్సు, బుద్ధి, చిత్తము, లింగదేహము, అదియే కదా. ఈమోహమేమిటికిఁ గలుగవలయును? అని యడిగిన శ్రీవిష్ణుఁ డిట్లనియె.

నారదా! తాళధ్వజుండు నావంటివాడేనా యని యడిగితివి. నీవంటివాఁడు కాక యతండు నిత్యు డాయేమి? ప్రపంచకమంతయు మాయాబలంబున నున్నట్లు కనంబడుచున్నది. అంతయు మిథ్య కాదా? సర్వజంతువుల దేహములయందు దశాభేదములంబట్టి మాయావిలాసములు వ్యాపించి యుండును. జాగ్రత్స్వప్న సుషుప్తులని యవస్థలు మూడుగలవు నాలుగవది దేహాంతరప్రాప్తి. స్వప్న వృత్తాంతములు మేలుకొనినతోడనే యన్నియుఁ బొడకట్టును. కలలోనున్నప్పుడు బాహ్యప్రచారము లేమైనం దెలియబడుచున్నవియా? నిద్రచేఁ జిత్తము జలింపఁగా స్వప్నములు వచ్చుచుండును. క్రూరజంతువులు తన్ను దఱుముకొనిరా స్థూలేంద్రియములు లేకపోవుటచేఁ బారిపోవ సమర్ధుఁడు కాఁడు. ఎన్నఁడో చచ్చిన పితామహుఁడు తనయింటికివచ్చి భుజించినట్లు కనంబడును! లేచినతోడనే యదియంతయు నసత్యముగాఁదోచును. అతఁడు వచ్చుటసత్యమా! అసత్యమా! కన్నులార జూడఁబడినట్లు మాట్లాడినట్లు తెలియబడుచుండును గదా. అదియే మాయాబలము. అప్పుడు నీవు నారదుండవని తెలిసికొనలేకపోయితివి. ఇప్పు డాకధలన్నియుఁ దెలియుబడుచున్నవి. మాయావిలాసములు స్వప్న భ్రమలవంటివని యెఱుంగుము.

మఱియు నేను శంకరుండు బ్రహ్మయుఁగూడ మాయాబల