పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/397

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

388

కాశీమజిలీకథలు - పదియవభాగము.

సీ మూర్ఖుఁడా! నాచెప్పిన నీతియంతయు వఱదపాలుగావించితివే. మోహమన నిదియేకాదా! ఇంత తెలిసికొనఁజాలకుంటివేమి? ఇది యొక యింద్రజాలమని గ్రహింపుము. ఎండమావులలో నీరు గ్రోలఁగలవా? నీవిట్లెన్ని కల్పములు దుఃఖించినను నీభార్య కనంబడదు. విరక్తుండనై యింటికిఁ బొమ్మని యుపదేశించిన విని తాళధ్వజుం డేమాటయుం బలుకనేరక లోలోపల దుఃఖించుచుఁ దటాకములో' స్నానముజేసి యింటికింబోయెను.

అని యెఱింగించి — పైమజిలీయం దిట్లు చెప్పఁదొడంగె.

__________

245 వ మజిలీ.

క. నారదుఁ డామాటలఁ జెవు
   లారఁగ విని నృపతిఁ గన్నులారఁగని యప
   స్మారుని గతిఁ దనమదిలో
   నూరక తలపోసిపోసి యూహగలంగన్.

గీ. నవ్వు, విలపించు, వగచి డెందమున దాను
   మున్ను జేసిన చేష్ఠలనన్ని దలఁచి
   స్వప్న మో! భ్రాంతియో! యింద్రజాలమో! య
   టంచుఁ దర్కించు నాకస మట్టెచూచి.

అతని చిత్తవికారంబరసి సరసిజాక్షుండు నవ్వుచు నారదా? నీవున్మత్తుండువోలె నీలోనీవే మాటలాడికొనుచుంటివేమి? జలంబుల మునింగి వింతలేమైన గంటివా! అని యడిగిన గ్రహించి నారదుండు ఓహోహో ఇదియా తాతా! తెలిసికొంటి నీవుపన్నిన యింద్ర జాలమా! నీచేతవంచింపఁబడితి. మాయాబలము జూపితివి. ఔరా! ఎన్నివిచిత్రములు గావించితివి? లెస్స. లెస్స. నేనాఁడుదాననై కావించిన చర్యలన్నియుఁ గన్నులకుఁ గట్టినట్లున్నవి గదా! అయ్యో!.