పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/396

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నారదుని స్వస్వరూపప్రాప్తి.

387

పింతునా! ఇంటికిఁబోయి యేమిచేయుదును? ఇల్లు సర్వశూన్యమై యున్నది. నేనుగూడ నాతటాకములోఁబడి ప్రాణములవదలెద. నాకు వేరొకగతిలేదని దుఃఖింపఁదొడంగిన వారించుచు నిందిరాభర్త రాజా! నీవు శాస్త్రములేమియుఁ జదువలేదా ! పురాణములు వినలేదా? పెద్దల సహవాసమేమియుఁ జేయలేదా? నీవు వట్టి మూఢుఁడవువలె దోచుచుంటివి. వినుము ప్రవాహరూపమైన సంసారమున భార్యా పుత్రాదులు నావయెక్కుటకుజేరిన పాంథులవలెఁ జేరికొని యెవ్వరిదారిని వారు బోవుచుందురు. వెనుకటి జన్మమున నామె యెవ్వతె? నీవెవ్వఁడవు? ఇప్పుడు కలిసి కొన్నిదినములు గాపురము సేసిరి. ఆమెదారి నామె పోయినది. నడుమవచ్చినది నడుమపోయినది. మొదటినుండియు నీకడనున్నదా! చేరకపూర్వ మామెయందు నీకీ మోహమున్నదియా! ఆమెరాక నీకు సుఖముగలిగించినది. పోక దుఃఖమైనది. దుఃఖాంతములు సుఖములని యెఱుంగవా. జ్ఞానము దెచ్చికొని మోహమును నాశనముజేయుము. తపోవనంబు నకుంబోయి యోగముపట్టి ముక్తుండవుకమ్ము. కానిచో మఱియొక యువతిం బెండ్లి యాడుము. వేయిసంవత్సరములు విలపించినను నీకాసుందరి గనం బడదు, పోపొమ్మని పలికిన విని యారాజు శ్రీహరికి నమస్కరించుచు నిట్లనియె.

అయ్యా! మీరెవ్వరో మహానుభావులగుదురు. మీమాటలచే నాశోకము కొంత తఱిగినది. కాని స్వామీ! నా సౌభాగ్యసుందరి నెట్లు మఱవఁగలవాఁడను? ఆనర్మోక్తులు, ఆప్రియభాషణములు ఆక్రీడలు తలంచికొనిన నామనసు దుఃఖసముద్రములో మునిఁగిపోవుచున్నది. అబ్బా! దురంతశోకానలంబున నామేను భగ్గున మండిపోవు చుస్నది. ఎట్లు తాళుదును సామీ! అని పరితపింవ నాక్షేపించుచుఁ బుండరీకాక్షుం డిట్లనియె.