పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/394

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నారదుని స్వస్వరూపప్రాప్తి.

385

నారదుఁడనా ? సౌభాగ్యసుందరినా ? సరి సరి. గర్భధారణ ప్రసవ వేదనము మొదలగు చర్యలన్నియుం గన్నులకుఁ గట్టినట్లుండ నిది వట్టిది యెట్లగును ! అయ్యో ! నేను నారదుండగానా ! స్నానము చేయుమని నన్ను విష్ణుండు ప్రేరేప నిందు గ్రుంకలేదా ! ఇంతలో నింతకాలమైనట్లున్న దే ! ఇంద్రజాల మేమో! ఏమియుఁ దెలియ కున్నది గదా! నే నిప్పుడు నిద్రలో నుంటినేమో! అంతయు నచ్యుతున కెఱింగించి నిజము దెలిసికొనియెదం గాక ! అని యాలోచించుచు మెల్లగా గట్టెక్కి విష్ణునికడ కరుగుచుండెను.

అంతలో నాతాళధ్వజనృపాలుం డాతటాకము దాపున కరుదెంచి పెద్ద యెలుంగున సౌభాగ్యసుందరీ! సౌభాగ్యసుందరీ ! యని పిలుచుచుఁ బ్రతివచనంబు బడయక గుండెలు బాదికొనుచు,

అయ్యో! అయ్యో! నాప్రాణనాయకి యీకొలనిలోఁ దిగి మునింగి పోయినది. జలజంతువులు మ్రింగినవి కాఁబోలు. అక్కటా! నేనిఁక నెట్లు బ్రదుకువాఁడ. హా ! పరమేశ్వరా ! అని పలుకుచు మూర్ఛవడి కొంతవడికి లేచి నలుదిక్కులు సూచుచు నింకెక్కడి సౌభాగ్యసుందరి! నీటిపాలైనది. అని గోలుగోలున నేడువఁ దొడంగెను. మఱియు,

సీ. సౌభాగ్యసుందరీ ! నాభాగ్యదేవతా!
               సతి! నన్ను విడిచిపోయితివె నీవు
    వద లెనే నేఁటితో ముదిత! నీతోపొందు
              నాకు దిక్కెవ్వరున్నార లింక
    కలికి నీప్రధమసంగమము నాఁటివినోద
              ములఁ దలంచిన గుండె కలక జెందె
    స్త్రీరత్నమనుచు వర్ణింపఁగాఁదగు నిన్నె
             తప్పులెన్నెద వరుంధతికినైన