పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/393

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

384

కాశీమజిలీకథలు - పదియవభాగము.

వాయగలదు. స్నానమాచరింపుము. అని యుపదేశించుటయు నా యోషామణి కించుక విరక్తిగలిగినది. సంసారము స్వప్న ప్రాయము. ఎండమావుల నీరు గ్రోలదలంచినట్లిందు సుఖపడఁదలంచుట భ్రాంతియేయని తలంచుచు నాచంచలాక్షి అట్టెలేచి యాపాఱుని వెంట నల్లంత దవ్వులోనున్న తటాకమున కరిగినది. భర్త యించుక యెడముగ నుండగనే మనములోదుఃఖించుచు నాజలాకరము లోనికిఁ దిగి దలవిప్పికొని మూడు మునుఁగులును మునింగి లేచినంత,

క. తీరమునఁ జూచె గరుడుని
   చేరువఁ గూర్చున్నవిష్ణుఁ జెంతను తన వీ
   ణారత్నము నజినంబును
   దారుకమండులువు విస్మితస్వాంతుండై .

పిమ్మటఁ దనయాకారము జూచుకొని యెప్పటి నారదవేషము ప్రత్యక్ష్యంబగుటయు మోహవివశుండై తన కుపదేశించిన బ్రాహ్మణు నందుఁ గానక క్రమ్మఱ దరిదెసకు జూపుల వ్యాపింపఁజేసి యందున్న శ్రీహరిని, దనవీణా కమండలువులగాంచి కన్నులమూసికొని సౌభాగ్యసుందరీ వృత్తాంతమంతయుఁ దలంచుచు నేది నిజమో యేది యసత్యమో తెలిసికొనఁజాలక తొట్రుపడుచున్న సమయంబునఁ బుండరీకాక్షుఁడు మందహాసము గావించుచు,

ఉ. స్నానముసేత కింత యట జాగొనరించితివేల ! నీ యను
    ష్ఠానము దీర్చుకొంటె మునిచంద్రమ! రమ్మట వేగ మేనునున్
    స్నానముజేసి వచ్చెద వెసంజనగాఁ దగు నూరిలోనికిం
    భానునిబింబ మప్పుడె నభంబు సగంబెగఁబ్రాకెఁ జూడుమా.

అని పిలుచుటయు నతం డాహా! ఇదియేమి మోహము ? తాళధ్వజునితో నెనుబదియేండ్లు కాపురముజేసి యిరువదిమంది బిడ్డలం గనిన దంతయు వట్టిదే. ఇది స్వప్నము కాఁబోలు. నేను