పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/391

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

382

కాశీమజిలీకథలు - పదియవభాగము.

దీర్చుచు నావంటి భాగ్యశాలిని యెందును లేదని గరువపడితిని. హాహా ! నిన్న నీపాటివేళ నాముద్దు కొమరులతో మాట్లాడుచు వారివారి భార్యల సౌందర్యంబునం గల తారతమ్యముల నిరూపించు చుంటి. ఛీ! ఛీ! నావంటి దౌర్భాగ్యురా లెందునులేదు. నాభర్త చెప్పినట్లు మృతినొంది సుతులతో ముచ్చటించెదనని పెద్దయెలుఁగున రోదనముజేయుచుఁ బౌత్రుల శవంబుల వెదగివెదకి గురుతుపట్టి తచ్ఛవంబులమీఁదఁబడి నాపోవుచు బెద్దతడ వాయుద్ధభూమి యున్మత్తవలె దల విరియఁబోసికొని తిరుగుచుండె. అప్పుడు,

క. వీపునఁ గృష్ణాజినము జి
   టాపటలము శిరమునందొడల భూతియు ను
   ద్దీపింపఁ బాఱుఁడొక్కరుఁ
   డాపడఁతి సమీపమునకు నరుదెంచి తగన్.

వృద్ధబ్రాహ్మణుడు - అమ్మా! నీవెవ్వతెవు? ఇట్లు దుఃఖించుచుంటి నెవ్వరి నిమిత్తము?

సౌభాగ్యసుందరి – (నమస్కరించి) మహాత్మా! నాదౌర్భాగ్య మేమి చెప్పుదును? ఏను తాళధ్వజనృపాలునిం బెండ్లియాడితిని. లోకైకవీరు లిరువదిమంది కుమారు లుదయించిరి. నాలుగుదిక్కులు జయించి త్రిభువనైకసుందరులం బెండ్లియాడి పెక్కండ్రఁబుత్రులం గనిరి. మావంశము యాదవవంశమువలె వృద్ధినొందినది. ఈదినమున శత్రువులచే నాకుటుంబ మంతయు నాశనమైనది. నేనును నాభర్త మాత్రము మిగిలితిమి. తండ్రీ! అని దుఃఖంచినది.

వృద్ధ — అమ్మా! నిన్నొక్కమాట నడిగెదఁ జెప్పుము. నీవా రాజుం బెండ్లియాడి యెంత కాలమైనది?

సౌభా - ఎనుబది సంవత్సరములైనది. ఆహా! నేననుభవించిన సౌఖ్యము ఇంద్రాణియైన ననుభవింపఁలేదు. తండ్రీ! ఆవైభ