పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/39

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

26

కాశీమజిలీకథలు - పదియవభాగము.

అప్పుడు చతుర్ముఖుఁడు తదీయశృంగారలీలావిశేషంబు లరసి యాహా. పరమవిరక్తుఁడగు కుమారుని శృంగారశేఖరుఁ గావించి భ్రష్టుఁజేసినవాఁడ నేనకదా! కానిమ్ము. ఉత్తమసత్వులకు విపత్తి మూలమునఁగాని యాత్మీయ సామర్థ్యము వెల్లడికాదని తలఁచి యతనినుద్దేశించి యిట్లనియె.

గీ. బ్రహ్మసభయంచునించుక భయములేక
   నిట నసభ్యప్రవర్తన లెసఁగఁజేసి
   తనయమతిఁగాన గంధర్వతనువువిడిచి
   శూద్రయోని జనింపుమా క్షోణియందు.

అని శపించుటయు నుపబర్హణుఁడాత్మీయ ప్రమాదవిధానంబు తెనిసికొని లజ్జావనతవదనుఁడై దోసిలివట్టి,

గీ. అట్లెమీయాజ్ఞశూద్రుండనగుదుఁగాక
    యపుడు శ్రీమన్ముకుందపాదారవింద
    భక్తియేమరకుండఁగ వర మొసంగు
    మిదియపదివేలు నాకులోకేశయనిన.

నీయభీష్టప్రకారంబె కాఁగలదని పలికి జలజగర్భుండతని వీడ్కొలిపి నుపబర్హణుఁడు క్రమ్మరనింటికి వచ్చి శాపప్రకారంబు భార్యల కెఱింగింపక వారితోఁగూడ విమానమెక్కి మలయపర్వతమునకరిగి విశాలరమణీయలతావేష్టితమగు నొక శిలాఫలకంబునం గూర్చుండి భార్యలకందలి వినోదంబులఁ జూపుచున్నంతలో,

క. తలనొప్పివచ్చె మేనికి
    బలువేకిజనించె మిగులబడలికదోపన్
    గలఁగియతఁడొక్క చెలితొడ
    దలగడగాఁజేసికొని వెతన్‌శయనించెన్.