పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/386

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జగన్మోహినికథ.

377

పిమ్మట భార్యలకు జెప్పి వారిచే ననిపించుకొని యారాజ కుమారు లందఱు తురగారూఢులై యారాక్షస వీరుల కెదురుగా బోయిరి. అప్పుడు,

క. కాలము మేలై యొప్పఁగ
   వాలికపులి మేకయగుచు వశమగు మఱి య
   క్కాలము చెడ మేకయె శా
   ర్దూలంబై మీఁదఁబడి నిరోధించుగదా.

గీ. లీలరౌతులతో మావటీలతోడ
   గుఱ్ఱముల నేనుఁగుల మ్రింగికొనుచు నసుర
   తరిమి సేనల గబళింపఁ దాళలేక
   పఱచె వెన్నిచ్చి సేన దిగ్భాగములకు.

అట్లా దానవవీరుండు రౌద్రాకారంబున సేనలం దరుముకొని వచ్చుచుండుటఁజూచి రాజకుమారు లందఱ నొక్క పెట్టున గుఱ్ఱముల వానిపైకిఁదోలి శూలంబులం బొడిచియు వాలమ్ముల నేసియుఁ గుఠారంబుల నరికియు నసుల విసరియు గదలమోదియు నిర్వక్రపరాక్రమంబున వానిం జుట్టుకొనుటయు వాఁడు కోపావేశంబున వామనమూర్తియుంబోలె నాభీలముగాఁ మేను బెంచి,

క. అరచేతఁ జఱచికొందఱ
   గురుగతిఁ బిడికిళ్ళఁబొడిచి కొందఱఁ గాలన్
   జరచర ద్రొక్కుచుఁ గొందఱ
   నరనిమిషములోన వారినందఱఁ జంపెన్.

అట్లయ్యసుర గడియలో రాసుతులనెల్ల గతాసులం గావించి రాక్షసవీరులతోఁగూడ నిరాటంకముగ నానగరాంతరము ప్రవేశించి పేర్చిన కార్చిచ్చువోలె నలుమూలలు నాక్రమించి ప్రజాక్షయము గావింపఁదొడంగె. మఱియు,