పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/383

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

374

కాశీమజిలీకథలు - పదియవభాగము.

మధుమతి — చంద్రకళ మంచిమాట చెప్పినది మనలో మనకి తగవేల. మన మన యభిప్రాయములు మన యత్తగారి కెరింగింతము. అమ్మహాసాధ్వి యెట్లుచెప్పిన నది సిద్ధాంతము. ఈమాట కందరు నంగీకరింతురా ? అని యడిగిన నేకగ్రీవముగా నొప్పుకొనిరి. అప్పుడే యాకాంత లందఱు సౌభాగ్యసుందరికడ కఱిగి తమ తమ వాద ప్రకార మంతయు నెఱింగించిరి. సౌభాగ్యసుందరియు నారదనామ స్మరణంబున నేదియో మఱచిపోయి జ్ఞాపకమురాక యాలోచించు చున్నట్లు తలంచుచుఁ గొంతసేపటికి వారికిట్లనియె.

యువతులారా ! మహర్షుల తారతమ్యము తెలియక యింద్రాది బృందారకులే తొట్రుపడుచుందురు. మనమెట్లు గ్రహింపఁగలము? ఒక్కొక్కమహర్షియం దొక్కొక్క శక్తి లోకాతీతమైనది యొప్పుచుండును. ఏముని కామునియే యధికుండని చెప్పవలయును. మూర్తిత్రయ తారతమ్యంబు నిరూపింప నెట్లు శక్యముకాదో యిదియు నట్టిదే. ఇప్పటికి మీరందరు గెలిచితిరి. అందరు నోడితిరి. సంతసింపుఁడని చెప్పిన విని యింద్రుని కూఁతురు మధుమతి యిట్లనియె.

అత్తా! నీయభిప్రాయము నే దెలిసికొంటి. మాలో నొకరి వాదము గెలిపించినఁ దక్కినవారు చిన్నవోవుదురని యట్లుపలికితిరి. మీఁకు గోడండ్ర యందరియందు సమానప్రేమయున్నది. మొన్న మేమిట్లే పతివ్రతలలో నుత్తమురా లెవ్వతెయని వాదమాడితిమి. అన్ని విధముల మీరేయుత్తములని యేకగ్రీవముగా నంగీకరించితిమి. మీ యెదుట మిమ్ము స్తోత్రము చేయఁగూడదు కాని ప్రశంస వచ్చినది కావునఁ జెప్పుచుంటి. మీరు కోడండ్ర నందఱను సమముగా జూచుచు సమప్రేమతో నాదరించుచుందురు. మాపూర్వపుణ్యవిశేషంబున మీయట్టి యత్తగారు లభించినదని స్తోత్రములు జేయఁగా సౌభాగ్య సుందరి యిట్లనియె.