పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/382

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జగన్మోహినికథ.

373

రత్నమకుట - నిలుఁడు నిలుఁడు. ప్రస్తుతాంశము మఱచి మఱియొక గొడవలోఁ బడితిరేల ? మనము మహర్షి శ్రేష్ఠు డెవ్వఁడని కదా తగవులాడుచుంటిమి. ఆవిషయమే ముచ్చటింపుఁడు.

గంధ - అక్కలారా ! మీరందఱు తలయొకనిం బేర్కొను చుంటిరి. సర్వముని సార్వభౌముండైన నారద మహర్షి మాట యెవ్వఱకును జ్ఞాపకము వచ్చినది కాదేమి ?

సీ. పుట్టుకతోడనే పొడమె నేతపసికి
              జ్ఞానవైరాగ్యవిశ్వాసబుద్ధి
    భరియించె నెవ్వాఁడు పరమేష్టిశాపంబు
              గామినీవై ముఖ్య కలన నెసఁగి
    బ్రహ్మాత్మజన్మతాపసు లెందరున్న నె
              వ్వఁడు దేవమునియంచు వాసిగాంచె
    మూఁడులోకమ్ములు క్రీడాలయములుగా
              జరియించు నేమౌనిచక్రవర్తి

గీ. యక్షగంధర్వసిద్ధవిద్యాధ రాది
    ఖేచరులు భూచరులు శర్వరీచరులును
    స్త్రీలుపురుషులు సమత నర్చింతు రెవని
    నట్టి నారదమునియే సర్వాథికుండు.

చంద్ర - అవును ఆమహాత్ముని మించిన విరక్తుం డెవ్వఁడు కలండు?

క. ౙరగునది యెఱిఁగిచేయును
   సరిమిత్రులు శత్రు లఖిలసముఁ డామునికిన్.
   హరిభక్తాగ్రేసరుఁ డ
   ప్పరమ తపోధనునిఁ బోలు పరముఁడు గలఁడే.