పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/381

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

372

కాశీమజిలీకథలు - పదియవభాగము.

రుక్మవతి - హరిశ్చంద్రునకు విశ్వామిత్రునివలనఁ గలిగిన కష్టములనే యుగ్గడించితివి కాని సుఖముమాట చెప్పవేమి? అమ్మహా రాజును మహేంద్రుని యర్ధసింహాసన మెక్కింపలేదా ! అదియునుంగాక హరిశ్చంద్రుఁడు పుత్రార్థియై వరుణు నారాధించి తనకుఁ బొడమిన కొడుకును పశువుగా వేల్తునని యొప్పుకొని కలిగిన పిమ్మట వరుణుం డరుదెంచి కొడుకును బశువుగా జేయుమనిన గడువులేర్పరచి త్రిప్పుచుండఁ గుమారుం డవ్విధం బెఱింగి పారిపోవుటయు దానం గోపించి వరుణుండు హరిశ్చంద్రుని జలోదర పీడితుండవు గమ్మనిశపించెను. తచ్ఛాపదోషంబునఁ బరితపించుచు హరిశ్చంద్రుఁడు అజీగర్తి యను బ్రాహ్మణుని మధ్యమకుమారుని శునశ్శేపుఁ డనువాని వారుణ యజ్ఞపశువుగాఁ జేయఁబూనినంత నాశునశ్శేఫుండు విశ్వామిత్రుని శరణుజొచ్చెను. పరమదయాసంపన్నుండగు నామహషిన్ శునశ్శేపుని కాపాడి హరిశ్చంద్రునియెడ వరుణుండు ప్రసన్నుం డగునట్లు చేసెను. హరిశ్చంద్రుని తండ్రి త్రిశంకు నిమిత్తమేకాదా క్రొత్త స్వర్గము నిర్మించెను. ఇన్ని విశేషము లే ముని యందున్నవి!

మహారాజిరత్నము - ఓహోహో ! ఇదెక్కడి కల్చన ? హరిశ్చంద్రుండు శునశ్శేపుని వరుణ పశువుగాఁ జేయుట యెప్పుడును వినలేదే. నీవు పొరపాటు పడుచున్నావు. హరిశ్చంద్రుని యజ్ఞమందు గాదు. అంబరీషుని యజ్ఞమందు. బాగుగా జ్ఞాపకము జేసికొనుము.

రుక్మవతి — నేనెఱింగియే చెప్పితిని. ఇందబద్ధములేదు.

మహా - నీవు రామాయణము చదువలేదా యేమి ?

రుక్మ - నీవు దేవీభాగవతము చదివిన నిట్లనవు.

మహా – రామాయణము కన్న దేవీభాగవతము ప్రమాణ గ్రంథమా?

రుక్మ - అది ప్రమాణగ్రంథము కాదని నీవెట్లు చెప్పగలవు ?