పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/38

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

213వ మజిలీ

మాలావతి కథ

క. నారాయణ నారాయణ
   శ్రీరాజితవక్ష దేవసేవితచరణాం
   భోరుహ కారుణ్యా కూ
   పారా క్షీ రాబ్ధిశయన పాలితభువనా.

బ్రహ్మలోకములో నొకనాఁడు సంగీతసభజరిగినది. ఆసభకు రమ్మని దేవలోకములోఁ బ్రసిద్ధివడసిన వైణికులకెల్లఁ బత్రికలువచ్చినవి. ఉపబర్హణుఁడు విమానమెక్కి యాగానసభకుఁబోయెను. ఉపబర్హణుని గీతప్రావీణ్యము మూడులోకములు వ్యాపించినది. అతండుండ మరియొకగాయకుఁడు నోరుమెదల్పఁ జాలడు. ఆసభలోఁగూడ నతండే వీణాగానంబున శ్రీహరిం గీర్తించుచు సభ్యులచే మెప్పువడసెను. తరువాత సభ్యులకుల్లాసము గలుగఁజేయ రంభచే నందు నాట్యము జేయించిరి. అప్పుడు,

చ. వలఁబడినట్టి జక్కవకవం బురడించి మెఱుంగుపైఁటలో
     గులుకుమిటారిబోటి చను గుత్తులనట్టె నలంతిగాలిఁ బై
     వలువఁదొలంగఁజూచి యుపబర్హణుఁడంగజబాణతప్తుఁడై
     స్ఖలనమునొందెఁగన్కొని పకాపకనవ్విరి వేల్పులెల్లరున్ .

గీ. రంభకన్నను గడునభి రామలైన
   రామలెందరొ కలుగభార్య లుగ నతఁడు
   రంభకుచకుంభములఁగాంచి భ్రాంతిపడియె
   పరతరుణులన్న రహిగాదె పురుషులకును.