పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/378

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జగన్మోహినికథ.

369

గు తనకుటుంబమును జూచికొని సౌభాగ్యసుందరి తన్నుఁబోలు భాగ్యశాలిని యెందునులేదని గర్వపడఁ జొచ్చినది. లెక్కింప నామె సంతతి వేలకు మించియున్నది.

అకుంటుంబాభివృద్ధి ఆవైభవముం జూడ నింద్రభోగముగూడ హీనముగాఁ దోపకమానదు. ఆమె సంతతము మనుమలతో నాడు కొనుచుండును. మునిమనుమల ముద్దాడుచుండును. కోడండ్రతో ముచ్చటించుచుండును. గృహకృత్యములయందు లోపము రాకుండఁ బరిచారికాసహస్రముల నియమించి సమకూర్పించును. అట్టిమర్యాద యట్టి నైపుణ్యము యట్టి గౌరవప్రతిప్రత్తి యేమత్తకాశినికిని గలుగ లేదని విఖ్యాతి పొందినది.

ఆమె కోడండ్రు యిరువదిమందియు భువనైకసుందరులు. సకల కళాభిరాములు. సర్వజనస్తవనీయ చరిత్రులునై తరుచువిద్యాగోష్ఠి చేయుచుందురు. వారిలో వారి కొకప్పుడు మహాఋషుల తారతమ్యము గుఱించి సంవాదము గలిగినది. అందు

ఇంద్రునికూఁతురు, మధుమతి — మహర్షులందరు లోకాతీత ప్రభావముగలవారే, కానివారిలో లోపాముద్రా మనోహరుం డగస్త్యమహర్షి సర్వాధికుండని నాయభిప్రాయము. వినుండు,

సీ. జనియించె నేమునీశ్వరసార్వభౌముండు
               ప్రభమీర మహితకుంభంబునందు
    నిల్వలవాతాపు లేమహామహు కుక్షిఁ
              జేరి త్రేఁపినయంతఁ జీర్ణమైరి
    మునులచేఁ బల్లకీ మోయించి నహుషుఁ డె
              వ్వని హుంకృతిని బదభ్రష్టుఁడయ్యె
    గ్రహతారకాదుల గతుల కడ్డముగ నే
             గిన వింధ్యనగ మేని ఘనతనడఁగె