పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/373

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

364

కాశీమజిలీకథలు - పదియవభాగము.

మనుష్యులను దోమలవలె నోఁటిలోవైచికొని నమలును. పొగవచ్చు చున్నది. వాఁడు వచ్చువేళ యైనది. మేము మువ్వురము చచ్చిన వారమే యగుదుము. నీవుగూడ మాతో నిలిచితివేల? అవ్వలఁ బారి పొమ్మని పలికిన విని నేను నవ్వుచు నిదియా కారణము ? చాలు జాలు. ఈయూర వానిం బరిభవించు శూరుం డొక్కరుండును లేడా? మీరు వెఱవకుఁడు. మీప్రాణముల నేను గాపాడెద నిలువుఁడని పలుకుచు నాచిన్న దానిని సందిటఁ బట్టి భుజముపై కెక్కించుకొని వారిం గూడ రమ్మని యొక్క యరగుపై బండుకొనఁ బెట్టితిని.

అంతలో నాకాంతకు మెలకువ వచ్చినది. తలిదండ్రు లామెపైఁబడు దుఃఖించుచుండిరి. అయ్యో! నాకతంబున మీరిందేల నిలువంబడితిరి? పారిపోవలేక పోయితిరా ? నేనెట్లైననుం జచ్చినదాననే. మీరున్న వంశము నిలుచునుగదా ? అని కన్నీరు గార్చుచు గూఁతు రేడ్చినది. అమ్మా ! నిన్ను వరప్రసాదమునఁ జిరకాలమునకుఁ గంటిమి. నీకుఁ బెండ్లిచేయవలయునని యెంతయో వేడుకతోఁ దలంచుకొనుచుంటిమి. నీవలనఁ కుల ముద్ధరించుకొనఁ దలంచితిమి. ఇట్టి నీవే మిత్తివాఁతంబడు చుండ మేము బ్రతికి యేమిచేయుదుము. ఈపాడురక్కసుఁ డీయేడు మన వీధికే రావలయునా ?

మనకర్మ మిట్లున్నది. మన యైశ్వర్యమంతయు నేలపాలైనది. మనమేకాక పాప మీ పుణ్యాత్ముఁ డెవ్వఁడో నీ కుపచారములు సేయుచు మనతోపాటు చావఁ దెగించియున్నాఁడు. అని పలుకుచు నుండఁగనే యావీధిం బోవువారు శ్రుతిభీషణముగా నార్చుచు నారక్కసుం డెదురుపడినంతనే వెనుకకు మరలి మఱియొక దెసకుఁ పాఱిపోవఁ దొడఁగిరి,

ఆరక్కసుని యార్పులు విని నేను నడుము బిగించి చేతం గరవాలంబుబూని నడివీధిలో నిలువంబడితిని నాసాహసముజూచి యాకు