పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/372

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జగన్మోహినికథ.

363

సంశయించుచు నుపచారములు సేయుచుంటిని. అంతలో నామె తలితండ్రులు పుత్రికం గానక వెనుకకు వచ్చి యందుపడియున్న యా సుకుమారగాత్రిం గాంచి అయ్యో ! నిన్నా రక్కసుండు మ్రింగఁగలఁడు. పడియుంటివేమని యేడ్చుచు నడిగిరి.

అప్పుడు నేను వారి నూరడించుచు రాక్షసుఁ డెవ్వఁడు ? ఎక్కడనున్నాఁడు ? మీరందఱు నిట్లు పరుగెత్తుకొని పోవుచున్నారు. ఎక్కడికని యడిగిన వా రిట్లనిరి. అయ్యా ! నీవెవ్వఁడవో క్రొత్తవాఁడవు. రాఁబోవు ననర్థము తెలిసికొనక యిందు నిలువఁబడి నాబిడ్డ కుపచారము సేయుచుంటివి కాని ఇఁక పదినిమిషము లిందుంటిమేని యారాక్షసుఁడు వచ్చి మనల భక్షింపఁ గలఁడు, అప్పుడే భూమి పగిలినది. పొగ పైకి వచ్చుచున్నది. మే మీబిడ్డను విడిచి పోఁజాలము. మేమెట్లైన శమనలో కాతిధులము కావలసివారమే పడుచువాఁడవు. నీవిందు నిలువఁబడితివేల? కాలికొలది పరుగెత్తి కొని యవ్వలివీధికిఁ బొమ్మని యుపాయము జెప్పిరి.

నే నారక్కసుని వృత్తాంతమంతయు వివరముగాఁ జెప్పుమని యడిగితిని. చావునకుఁ దెగించి పుత్రికను విడువలేక యందు నిలువంబడి యున్న వారగుట వారు నాతో నార్యా! యీనగరములో నేఁడాది కొకసారి యిట్లే చప్పుడై భూమి పగిలి యొక చో వివరమేర్పడును. ఆవివరమునుండి భయంకరాకారముగల రక్కసుఁ డొక్కఁడు బైటకు వచ్చి యావీథినున్న మనుష్యుల నెల్ల నాబాలవృద్ధముగా భక్షించి పోవును. ఆవీథి సర్వశూన్యమై యరణ్యప్రాయ మగును. నాలుగేండ్లనుండి యిట్లు వచ్చుచున్నాఁడు. ఈవీట నాలుగు వీధులు పాడై పోయినవి. ఈసంవత్సర మీవీధికివచ్చుచున్నాఁడు, ముందుగా గొప్పచప్పుడు వినంబడును. తరువాత భూమిపగిలి వివరమేర్పడును. దానినుండి పొగవచ్చును. ఆవెంటనే రాక్షసుండు వచ్చి కనంబడిన