పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/369

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

360

కాశీమజిలీకథలు - పదియవభాగము.

సందునుండి యెనిమిదిగింజలు జారి యగ్నియందుఁ బడినవి. దానంజేసి నీకెనమండ్రువుత్రులు పుట్టుదురు. మరణము మానుమనిచెప్పి స్వామి యంతర్హితుఁడగుటయు సంతసించుచు నావిప్రకన్య తటాకములో స్నానముజేసి స్వామి నర్చించుచుండ నింతలో నామెతండ్రి శిష్యులతోఁగూడ వెదకికొనుచు నాస్థలమున కరుదెంచెను.

చెట్టుచెట్టునందువెదకి యొకచోనాకన్నెంగని కన్నీరుగార్చుచు బలవంతమున నింటికిఁ దీసికొనిపోయి కాపాడుచుండెను. ఒకనాఁడా చతుర్వేది శిష్యులతోఁగూడ సోమదత్తుని యింటికివచ్చి తండ్రిచేఁ బూజింపఁబడి కన్నెంజూచి యాశ్చర్యమందుచు నీదివ్యాంగన యెవ్వతె? దేవలోకము విడిచి భూలోకమున కెట్లువచ్చినది! అని యడుగ నాపాఱుఁడు వానిమాటలు పరిహాసజల్పితములనుకొని హీనన్వరముతో నిది నాకూఁతురు. దీని కింకను బెండ్లిచేయలేదని చెప్పెను.

దీని నాకిచ్చి వివాహము గావింపుము బెండ్లియాడెదనని యడిగిన సంతసించుచు నాసోమదత్తుఁ డప్పుడే వాని కాచిన్నదానినిచ్చి పెండ్లి కావించెను. ఆమెయం దతఁ డత్యంతానురాగంబున మెలంగుచు నామెచెప్పినట్లు వినుచు నామెయిష్టమువచ్చినట్లు కాపురముసేయు చుండెను. ఆపింగళికనే నేను. నాకతనివలన నెనమండ్రుకుమారు లుదయించిరి. వీరే వారు, శ్రీహరికృపచేఁ గలిగినారని యెఱింగించి మఱియు నిట్లనియె.

అట్లు కొంకతకాలమరుగ నొకనాఁడు నాభర్త నన్నుఁజూచి చండీ! నాకుఁ గాళ్ళు నొప్పిపెట్టుచున్నవి. పిసికెదవా? అని యడిగెను. ఎప్పుడు నన్నట్లడుగలేదు. నే నిట్లంటి. నీవు నాకేమైన నిచ్చి నన్నుఁ గొంటివాయేమి? ఊరక నీకుఁ బాదసంవాహన మేమిటికిఁ గావింపవలయును? అని యుత్తరమిచ్చుటయు నామగఁడు నీవుమాత్రము నన్నుఁ గొంటివా యేమి! సంతతము నీకుపచారములు సేయుచుండ