పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/367

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

358

కాశీమజిలీకథలు - పదియవభాగము.

హ్యించుకొనుచుఁ గుమారులఁ జూచి యాశ్చర్యమందుచు నీనెవ్వతెవు ? ఈకుమారులెవ్వరు. నీవృత్తాంతముజెప్పుమని యడిగిన నావికృతాంగి యిట్లనియె.

ఈబిడ్డలు నేను గన్నవారే. నాపతి దేశాంతరమరిగిరని చెప్పిన వింతపడుచు నతఁ డౌరా నీకుఁ బతియున్న వాఁడా నిన్నెట్లు పెండ్లి యాడెను. ఇది వింతగానున్నది నీకథచెప్పుమని యడిగిన నామె యిట్లనియె. అయ్యా వినుండు.

పింగళికకథ.

అవంతిదేశములోఁ గపిష్ఠిలమను నగ్రహారముగలదు. అందు సోమదత్తుడను బాహ్మణుఁడు వేదవేదాంగపారంగతుఁడు కాపురము సేయుచుండెను. అతనికి వేన వేలు శిష్యులుగలరు. ఆవిప్రునిభార్య యరుంథతికన్నను మిన్నయని చెప్పనోపు. అపుత్రుకుఁడగు నాపాఱునకుఁ గొంతకాలము గతించినంత నుత్కలవలె నొకకూఁతురు పుట్టినది. స్త్రీలక్షణవేత్తలు దానింజూచి దీనికిఁ బతియు బుత్రులుండరు;. దేశాటనముచేయునని యెఱింగించిరి. ఆబాలిక ధూమకేతువువలె వారింట నెదుగుచుండెను. అన్నియు దుర్గుణములే. సుగుణమొక్కటియునులేదు. ఆచారహీనురాలై మాలపల్లెలోనికిఁగూడఁ బోయి వచ్చు చుండును. దాని యాకారము గుణములు జూచి యెవ్వరు బెండ్లి యాడలేదు. ఆచింత సోమదత్తుని స్వాంతమున మిక్కిలి వేధించు చుండెను. కనంబడిన పిల్లలను జావఁగొట్టుచుండును. పెద్దలపై రాళ్లు విసరుచుండును.

ఒకనాఁడొక వటుఁడు వీధింబడి పోవుచుండఁ బెద్దరాయి తీసికొని వానిం గొట్టినది. మొగము గంటుపడి బొటబొట రక్తముగారుచుండఁ సోమదత్తునొద్దకుఁబోయి యావ్రణము చూపినీకూఁతు రిట్లు కొట్టినదని రాయిఁ చూపెను. అప్పుడాసోమదత్తుఁడు మిక్కిలి కోపిం