పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/365

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

356

కాశీమజిలీకథలు - పదియవభాగము.

అప్పుడు మేమాలోచించి మీతండ్రిని బలవంతమున గట్టించి బందీ గృహంబునఁ బడవేసితిమి. దైవికముగా నతఁ డాచెరసాలలో మృతుఁడయ్యెను. దానంజేసి మీకీకౌలీనము సంప్రాప్తించినది. ఇందులకు మేమే కారకులమని చేసినపనియంతయుం జెప్పిరి.

ఆవార్తవిని రాజపుత్రుఁ డదోముఖుండై క్షణకాల మూరకొని చేతులచే నేలంగొట్టుచుఁ గన్నుల నీరుగార నాకాశమువంకఁ జూచుచు నిట్లనియె.

మీరు శుక్రబృహస్పతులతో సమానులగుదురు. మీరు నా హితముగోరి మంచికార్యమేచేసితిరి. కాని యిట్టిపనులు శంకాశూన్య బుద్ధులగు సత్వవంతుల క్రమముగాని దృష్టాదృష్టభయగ్రస్తచేతస్కులగు మావంటివారికిఁ జెల్లనేరదు. నేనీభూమిని బాలింప సమర్ధుడఁ గాను. నేనీ యపఖ్యాతి భరింజాల. మాతమ్ముని రాజుగాఁజేసి మీరీరాజ్యము పాలించుఁడు. నేను తపోవనంబున కరిగెదనని పలికిన విని వారు సిగ్గుపడుచుఁ దలవాల్చుకొని యేమియుఁ బ్రత్యుత్తరము చెప్పలేకపోయిరి.

ఈసంవాదమంతయు రాత్రిజరిగినది. అంతలోఁ గోళ్ళు కూసినవి. అప్పుడు వందిమాగధులు జయము మహారాజా జయము. దిగంతవ్యాప్తయశఃసముదయా జయము. సకలభూపకిరీటమణి నీరాజితచరణా జయము. అని స్తుతియింపుచుండ సిగ్గుతోఁ జెవులు మూసికొని చాలుచాలు నాకీర్తి దిగంతముల వ్యాపించినది. వందిమాగధులనూరకొనుమనిచెప్పుమని ప్రతిహారిచే వార్తనంపెను.

అయ్యో ! చిరకాలము జీవించెడు తండ్రిని నావలె నెవ్వఁడు చంపించును. నేను మహాపాపాత్ముఁడ నాకీపాప మెట్లుబోవును? అని దుఃఖించుచు నప్పుడే జటావల్కముల ధరించి తపోవనంబునకుఁ బోవుట కుద్యోగించి సభామంటపమునకుఁ బాలకుని రప్పింపుఁడని,