పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/364

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గోపాలునికథ.

355

యుండ నీయాస్తి నాకీయవు. ధనహీనుండనై నేనెన్నినాళ్లు కష్టముల పాలగుచుందును? మనరాజు గోపాలుండు బలవంతమున దండ్రి జంపించి రాజ్యము గైకొన్నట్లు నిన్నుఁ జంపి నీధనము లాగికొందును చూడుమని యదలించెను.

ఆమాటలాలించి యాగోపాలుండు దుఃఖముతో నింటికిఁబోయి యారాత్రి నిద్రఁబోక యెట్టకే తెల్లవార్చి మంత్రికుమారులిద్దర రప్పించి రాత్రిజరిగిన చర్యలన్నియు నెఱింగించి యిట్టి యపఖ్యాతి నా కెట్లువచ్చినదని యడిగిన వారిట్లనిరి.

నీతండ్రి వార్ధక్యంబున జనకంటకములైనపనులనేకములుగావించెను. వినుము. ఒకనాఁడు క్షౌరము చేయించుకొనుచుండ మంగలవాఁడు దెల్లవెండ్రుకల లాగుచుఁ బ్రమాదవశంబున నల్లవెండ్రుక యొకటి తీసెనఁట. దానం గోపించి వానిం జంపించెను.

మఱియు వంటబ్రాహ్మణుఁ డొకప్పుడు కూర వండి వడ్డించగా దాని నమలునప్పుడు చిన్న రాయి తగిలి పన్నూడినదఁట. దానంజేసి వానిని వెంటనే పరిమార్పించెను.

మఱియొకప్పుడు బ్రాహ్మణులు ద్రవ్యార్థులై వచ్చి యాశీర్వదింప నారొదవలనఁ దలనొప్పివచ్చినదని వారినందఱం బట్టించి బందీ గృహంబునఁ బెట్టించెను. పార్శ్వంబున నిలిచి వింజామర గట్టిగావీచినదని చామరగ్రాహిణిం గొట్టించెను. వందిమాగధులు వేకువజామున నిద్రాభంగము గావించిరని కొరడాలచే బాదించెను. ఈలాటి ఘోరకృత్యము లనేకములు గావింపుచుండ వారించియు నప్పనులు మాన్పింపంజాలక దుఃఖించుచు నావిచారముతోఁ బెద్దమంత్రి కాలధర్మము నొందెను.

తరువాత మేము మంత్రిపదవి నధిష్టించితిమి. రాజుచేయు పనులవలనఁ బ్రజల కీర్ష జనించినది. అతని మరణము కోరుచుండిరి.