పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/362

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గోపాలునికథ.

353

యుండ నేనిం దధముఁడనై వట్టికుంకవలె నీకొఱకు వేచియుంటి. నాదే తప్పు.

అభి – అట్లనరాదు. భర్తలయందు ప్రీతిలేకయే విటులతో స్త్రీలు రమింతురు. భర్తలమూలమునఁ గులటలకునాటంకములు గలుగుచుండును. ఈగలేని తేనెవలె నిర్భయముగా విటులతో స్త్రీలకుఁ గలిసికొనుభాగ్యము పట్టుట కష్టము. నేనేమి చేయుదును?

కాము — నీయభిప్రాయ మేమియో నాకుఁదెలియలేదు.

అభి – నాకు భర్తయుఁ బిల్లవాఁడును నీక్రీడ కాటంకము గలుగఁజేయుచున్నారు. నీవు సంశయింపక వారిద్దరిం గడతేర్చితివేని హాయిగా మనము సుఖింపవచ్చును.

కాము - చాలుఁజాలు, ఇదియా నీవు చెప్పిన యుపాయము అది మహాపాతకముకాదా! నేనొల్లను.

అభి – నీవుపాపమునకు వెఱచి యట్టిపని చేయవేని నేను నాయిష్టము వచ్చిన ట్లనుభవించుటకు వీలుండదు.

కాము – ఆపాపకృత్యము నాకంగీకారముకాదు.

అభి - చాలుచాలు. దుర్వారరాగాంధులకుఁ జేయరాని పనులుండవు. బ్రహ్మయంతటివాడు కూఁతుతోఁ గలిసికొనియె. దీనింబట్టి చూడ నీకు నాయందు గాఢానురాగము లేనట్లు తోచుచున్నది.

కాము - అనురాగము కలిగియున్నదని ఘోరకృత్యము లెట్లు చేయుదును?

అభి — అయ్యనురాగమే చేయించును. సుఖార్ధుఁడవైతివేనితప్పక నప్పని సేయుము. మన రాజవుత్రుఁడు సుఖార్థియైకాదే తండ్రినిం జంపించెను. ఆవార్త నీవు వినలేదా? మహారాజులే ఘోరహత్యలు గావించుచుండ సామాన్యుండవు నీవిట్లు సంశయింతువేమిటికి? రేపు సాయంకాలము మాయింటికి రమ్ము. వారు నిద్రించుచుండఁ గత్తిచే