పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/361

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

352

కాశీమజిలీకథలు - పదియవభాగము.

రానేరదు. అని చింతించుచు నుత్సాహముడిగి యా యూరేగింపు మానిపించి యింటికిఁబోయి లోకాపవాదమునకు వెఱచుచు నాఁటి రాత్రి నల్లని కంబళి గప్పుకొని ఖడ్గముచేతఁబూని ప్రచ్ఛన్నముగా గ్రామసంచారము గావించెను. అందొక పాడుదేవాలయమున నభిసారికతోఁ గాముకుఁడు మాట్లాడుచున్న మాట లిట్లు వినంబడినవి.

కాము - ఓసీ! నీనిమిత్తమై యెంతసేపటినుండి వేచియుంటిని. నీమాటలు నమ్మి వృథాశ్రమపడితిని. వీలులేదని మొదటనే చెప్పితివేని రాకపోవుదునే?

అభి - మనోహరా! నేనందుల కే వెఱచుచుంటి. పాపము. నీవు ముందుగవచ్చి కూర్చింటివా? కాల మెట్లుజరిపితివో!

కాము --- పాప మనుచుంటివా చాలు చాలు. నిజముగా నాపైనీకుఁబ్రీతియున్నదని ముందుగవచ్చి కూర్చుంటి. నీవు రాకున్న నేమియుందోచక యాకసమును పిడికిటిచేఁబొడిచితిని. యూకవలిచితిని. అబ్బా! అప్పటి దుఃఖ మేమిచెప్పుదును? పిట్టలేచినను నాకు గదలిన నీవే వచ్చుచుంటి వనుకొంటిని. నీవు వట్టిదొంగవని యిప్పటికిఁ దెలిసికొంటిని. చాలు నీస్నేహము చాలు.

అభి – అయ్యయ్యో! నీవట్లనిన నాగుండె పగిలిపోవుచున్నది. నాచిక్కులు వినిన నీవిట్లనక పోవుదువుగదా.

కాము — ఆచిక్కు లెట్టివి? నీవు మహాపతివ్రతవలె యింటిలో నటియించితివి కాబోలు.

అభి — కాదు మనోహరా! నామాట వినుము. నాకుఁ బిల్లవాఁ డున్నాడనుమాట యెఱుంగుదువా? వానిని నిద్రపుచ్చవలయునా? నాభర్తకుఁ బెందలకడ నిద్రపట్టదు. ఏమిచేయుదును? ఆయాటంకములుండఁ బెందలకడ యెట్లురాఁగలనో చెప్పుము ?

కాము - అవును. నీమగఁడును గుమారుడును నాకన్న నిష్టులై