పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/360

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గోపాలునికథ.

351

జనియించిరి. వారిరువురు రాజపుత్రులకు సమానప్రాయులగుట నలువురం గలిసి విద్యాభ్యాసము జేయించుచుండిరి.

కొలదికాలములో నలువురు సమస్తవిద్యలం జదివి మహాపండితులని ప్రఖ్యాతి వడసిరి. కొంతకాలమునకు మహాసేనుఁడు లోకాంతర గతుం డగుటయు మంత్రు లతని పెద్దకుమారుఁడు గోపాలునికిఁ బట్టము గట్టిరి. అతని తమ్ముఁడు పాలకుఁడు యువరాజయ్యెను. మంత్రి పుత్రు లిరువురు మంత్రులై సమస్త కార్యములు న్యాయముగా జరుపుచు రాజ్యతంత్రము లనుకూలముగా నెఱవేర్చుచుండిరి.

ఒకనాఁడు గోపాలుండు విజయదశమి పండుగకు పట్టపేనుఁగ నెక్కి తూర్య ఘోషములు భూనభోంతరాళములు నిండ మహావైభవముతో నూరేగుచుండెను. అప్పుడు పౌరులు మేడలెక్కియు గోడలెక్కియు నాయుత్సవమును రాజును జూడఁ దొడంగిరి. ఒకానొక బ్రాహ్మణ వీధిం బోవుచుండ నొక బ్రాహ్మణ కన్యక మదురుగోడ యెక్కి రాజపుత్రుం జూచుచుండ నతని యేనుఁగ తొండముతో నా కన్యకం బట్టుకొనఁబోయిన నాయబల యడలుచు నేలంబడినది. అప్పుడు గోపాలుఁడు వెఱచుచు మదకరి నాపీ యాపిల్లను మెల్లగా లేవదీయించి అయ్యో! పాపము! నీకు దెబ్బ తగిలినదికాఁబోలు. ఉపచారములు సేయింతు నూరడిల్లుమని పలికిన నాకలికి యతనిం జురచురం జూచుచు రాజవుత్రా! నీవు చంపఁదగని తండ్రినే చంపించి రాజ్యంబు గొంటివి. వేదాధ్యయనసంపన్ను లగు బ్రాహ్మణులం జంపువానికి మృగములం జంపుట లక్ష్యమా! నీయేనుఁగు నన్నిట్లు బాధించుటలో నాశ్చర్యము లేదని యాక్షేపించుచు నాకన్యక లోపలికిఁ బోయినది.

చండాలుండైన విన నసహ్యించుకొనఁదగిన యాకన్యకా వాక్యములువిని రాజపుత్రుఁడు చిన్నవోయి అయ్యో! నన్నీ చిన్నది యిట్లు నిందించినదేమి? నేను మాతండ్రి నెట్లుచంపితిని? లోకాపవాద మూరక