పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/359

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

350

కాశీమజిలీకథలు - పదియవభాగము.

డాసల్లాపములఁ జొక్కి తిగిరి బసలోనికిం బోలేక పోయితినని సౌమ్యుఁడు తనకథ నెఱింగించెను.

అని చెప్పువఱకు వేళయతిక్రమించినది. మణిసిద్ధుం డవ్వలి కథ పై మజిలీయందిట్లు చెప్ప మొదలు పెట్టెను.

___________

242 వ మజిలీ.

మయూరధ్వజునికథ.

పిమ్మట మయూరధ్వజుండు తనకథ నిట్లు చెప్పఁదొడంగెను. సోదరులారా ! మిమ్ము నేవిడిచి దక్షిణవీథింబడి పెద్దదూరము పోయితిని. ఆనగరము తుది చూచితీరవలయునని నాకు బుద్ధిపుట్టి వేగముగా నడువఁ దొడంగితిని. ఎంతసేపు నడిచినను దుది కనంబడదు. ఇంక చాలదూర మున్నట్లు చెప్పిరి. అంతలో సాయంకాలమైనది. దీపము లెల్లెడల వెలిగించిరి. అప్పుడు నాకొకవీథి కన్నులుపండువు గావించినది. నేనా వీథిని గొంతదూరము పోయితిని. ఒకవీథి యరగుపైఁ గూరుచుండి కొందఱు కథలుచెప్పుకొనుచుండిరి. నేనుగూడ నందొకచోఁ గూర్చుండి యాకథల వాలించితిని. కథకుఁ డిట్లు చెప్పదొడంగెను.

గోపాలుని కథ.

ఉజ్జయినీవురంబున మహాసేనుఁడను రాజు రాజ్యము సేయు చుండెను. అతనికిఁ బదాఱువేల భార్యలు గలిగియున్నను సంతానాభివృద్ధి లేకపోయినది. యెప్పటికో గోపాలకుఁడు, పాలకుఁడు అను పేరులుగల యిరువురు పుత్రులుదయించిరి. అతనిమంత్రి భరతరోహకుఁడనువాఁడు. నీతిశాస్త్ర పారంగతుఁడు. అయ్యమాత్యునికిఁగూడ రోహాంతకుఁడు, సురోహకుఁడు, అను పుత్రులిద్దఱు పెద్దకాలమునకు