పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/358

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కుందమాలకథ.

347

మంది నిట్లు చంపినదో. దీనిమేను తునుకలుగాఁగోసి పారవేసినను దోసములేదు. అని యాలోచించుచు దాని తరువాయి చర్యలు పరీక్షించు తలంపుతో నం దొక తలుపుమూల డాగి చూచుచుంటిని. పఱుపు జూరిపడుటకు గురుతుగానుంచిన గంటచప్పుడు విని దాదియు నదియు నచ్చటికివచ్చి శయ్యజారుట తెలిసికొని యిట్లు సంభాషించిరి.

వ్యాఘ్ర - ఒసేవు! అబ్బాయిగారి పని అయినది. నూఁతిలోఁ బోయి శయినించినారు. అమ్మాయి వీనిమాటలు విన్నదా? లేదా?

దాది - అమ్మాయిగారు మీరాయనతో మాట్లాడుచుండగాఁ వచ్చి చూచిపోయినది. వాని సౌందర్యము చూచి వలచినది. తన కతనినే పెండ్లిచేయుమని మీతోఁ జెప్పుమన్నది. ఇంతలో మీరీపని కావించితిరి.

వ్యాఘ్ర - రండవు నీవు వానియందము దానికడఁ బొగడితివి కాఁబోలు లేకున్న నది యేమిటికి వచ్చి చూచును ?

దాది — అవును. ఆమాట వాస్తవమే. మీకుఁ జెప్పలేము గాని ఆయన మంచి చక్కనివాఁడు. అట్టి యందగాని నింతకు ముందు నేను జూచియుండలేదు. మనకుందమాలకుం గూర్పివలసినది.

వ్యాఘ్ర - ఓసి రండా! మంచియాలోచనయే చెప్పుచున్నావు. అమ్మాయిగారు అప్పుడే మగనిఁ బెట్టుకొని కులుకవలయునని చూచుచున్నది కాఁబోలు. ఇంకను బదారేండ్లు నిండలేదు. అప్పుడే విటులు నలుగురు త్రొక్కి, విడిచినచో దమ్మిడీ చేయదు. ఆకుట్లబొంత నెవ్వఁడు వలచును? ఈబెట్టుమీఁదనే విత్తము సంపాదింపవలయును. దాని లావణ్యము తెలిసియేకదా గొప్పగొప్ప విటులు వచ్చుచున్నారు.

దాది – ఆమ్మా! ఎల్లకాలము సంపాదనయే? ఉన్న సొమ్ము చాలదా. పెక్కేల. మీరు చేయుచున్న ద్రోహకృత్యము లమ్మాయిగారి కిష్టములేదు. మీతో బలుమాఱు చెప్పుమన్నది.