పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/355

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

344

కాశీమజిలీకథలు - పదియవభాగము.

కొంతదూరము కలిసిపోయితిమి. ఒకవీథిలో నే నతనివిడిచి పైకిఁ బోయితిని. ఒకచోట నడివీధిలోఁ గూర్చుండి కొందఱు గోవాళ్ళు విలాసముగా మాట్లాడికొనుచుండ నందొకచోఁ గూర్చుండి యాలకించితిని.

ఒకఁడు - కుందమాలతల్లి వ్యాఘ్రముఖిమాట యముండు మఱచిపోయెనేమో ఎంత కాలమునకు దానికిఁ జావురాదేమి ?

మఱియొకఁడు — కుందమాల యౌవనము లావణ్యము సౌందర్యము త్రిభువనాభిరామంబై యొప్పుచున్నది. అయిననేమి నీవనినట్లుమాతృపిశాచావేష్టితయగుట నది యెవ్వరికి నుపయోగ పడకున్నది.

ఇంకొకఁడు — వ్యాఘ్రముఖి కుందమాలకుఁ గన్యాత్వహాని కాకుండ విటుల వంచించుచు ధనమార్జించుచున్నదఁట యెట్లు?

ఒకఁడు - ఆరహస్యమే యెవ్వరికిం దెలియదు. దానిలోపలికిఁ బోయినవాఁడు తిరుగావచ్చి యిట్లైనదని చెప్పినవాఁ డొక్కరుఁడును గనంబడలేడు. నే ననేకదినములనుండి చూచుచున్నాను.

మఱియొకఁడు - గ్రామస్థుల నెవ్వరిని గదిలోనికి రానీయదఁట వింటిరా? పొరుగూరివాండ్రుగాని దానికపటములోఁ జిక్కికొనరు.

ఒక్కఁడు — ఎట్లైననేమికుందమాలచక్కఁదనము చూచితీఱవలయు. మొన్న గరుడోత్సవములోఁ జూచితిని. అబ్బా! దానియందము, బింకము, పొంకము, సౌరు, టక్కు మన నగరములోనున్న వారకాంతల కెవ్వరికిని లేదు.

మఱియొకఁడు – అది మనఁబోఁటులకు లభ్యముకాదు. అందరానిపండ్ల కాశపడనేల? నాతోరండు మఱియొకవింతఁ జూపెదనని చెప్పగా వానివెంట నందఱు లేచి యెందేనింబోయిరి.

నేను వారి సంభాషణములన్నియు వింటిని. కుందమాల మిగులఁ జక్కనిదని తోఁచి దానిం జూడవలయునని యభిలాషగలిగిన ది.