పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/353

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

342

కాశీమజిలీకథలు - పదియవభాగము.

మణిమంతుని యల్లుఁడు మనవాఁడేకాఁబోలు. కానిచో నితరున కాబింక మెట్లువచ్చెడిని. నేఁడు మంచిసుదినమే యని సంతసించుచు దమవాఱువముల వారిచేరువకుఁ బోనిచ్చిరి. వారు వీరిం గుఱుతుపట్టలేకపోయిరి. ఎఱింగియే పింగళుడు-

క. నిలు నిలుఁ డేయకుఁ డేయకు
   డలఘువ్రతులార యుష్మదభిదానములం
   దెలుపుఁడు పదఁపడి మనమన
   బలములు దెలియంగవచ్చు భండనవేళన్.

అని యడిగిన విని చిత్రభానుండు

గీ. పుడమిఁ దాళధ్వజనృపాల పుత్రకులము
   శూరమణి పుష్ప కేతుని సోదరులము
   క్షత్రియాన్వయభవుల మాక్రాంతసంగ
   రోత్సవప్రీతులము విజయోత్సుకులము.

అని చెప్పినంత వారిరువురు గుభాలున గుఱ్ఱముల డిగ్గనుఱికి తమ్ములారా! రండు రండు మేము మీసోదరులము. తెలియక యొండొరులము కలహింపదొరకొంటిమని పలుకుచుండఁగనే వారును వారువముల దిగి వారిం గౌఁగిలించుకొనిరి. అప్పుడు పింగళుఁడు వారితో దైవసంకల్పము కడువిచిత్రమైనది. పదిదినములలో నెన్నిమార్పులు కలిగినవి? పెద్దన్న యీవీటికి రాజయ్యెను. చిత్రభానుఁడు కోటీశ్వరుని పట్టిం జేపట్టెను. మయూరధ్వజుఁ డేమిచేసెనో తెలిసికొనవలసి యున్నది. సౌమ్యుఁడు ఇంటికడ మనజాడ నరయుచు నుండెనేమో? మనమీనగరము చేరినవేళ మంచిదే యని సంభాషించుకొనుచున్న సమయంబున సౌమ్యుండు గుఱ్ఱమెక్కి కొందఱయోధులం దఱుముకొని యచ్చటికి వచ్చెను.