పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/352

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మణిమంతునికథ.

341

నచో వారిం గలసికొని తోడుచేసికొనియెద. నీవు విచారింపకుమని పలుకుచు నతండు వత్తునన్న వేళకు గుఱ్ఱమెక్కి యావీథిం దిరుగు చుండెను.

మయూరధ్వజుం డెందుండియో యాదారి నరుదెంచుచు గుఱ్ఱముపై నున్న చిత్రభానుని గుఱుతుపట్టి అన్నా ! నీవిందున్నా వేమి ? ఈగుఱ్ఱమెక్కడిది ? బసలోని కరిగితివా? సోదరులం గలసికొనుచుంటివా అని యడిగిన విని యబ్బురపాటుతోఁ దమ్ముఁడు మయూరధ్వజుఁడా! బాగు బాగు. తలంచినంతనే కనంబడితివే. నే నొక్కగొడవలోఁ బడిపోయితిని. మన మీపట్టణప్రభువు ఆఁడుదియని యుపేక్ష చేసితిమి. మగవాఁడఁట. నాకిప్పుడతనితో విరోధమువచ్చినది. నన్నుఁ బట్టికొనుటకు వచ్చుచున్నాఁడు. వాని ప్రాణమునకు మనమిద్దరము చాలమా? తక్కినసోదరులఁ బిలువనేల. ఆగుఱ్ఱమెక్కి నిలఁబడు మని పలికిన సంతసించుచు మయూరధ్వజుఁడు వేఱొక తురగమెక్కి కత్తిచేతంబూని యిటునటు స్వారిచేయుచుండెను.

అంతలో భేరీధ్వానము దంధణ యంచు మ్రోఁగుచుండెను. పుష్ప కేతుఁడు తమ్ముఁడు పింగళునితోఁ గూడఁ దురగారూఢుండై వీరయోధులు పెక్కండ్రాయోధనసాధనంబులఁ బూని చుట్టునుఁ బరివేష్టించి రాఁ దురగఖురపుటీపాటితంబగు భూరజం బాకసంబుగప్పి చీఁకటి గలుగఁజేయఁ బటురయంబున మణిమంతుని గృహంబు నికటంబున కరిగెను.

మయూరధ్వజుండు చిత్రభానుండును వారిరాకఁ దెలిసికొని తమ ఘోటకముల విచిత్రగతుల నడిపించుచు వారి కభిముఖముగా నిలువంబడి చూచుచుండిరి. అప్పుడు పింగళుం డన్నల గుఱుతుపట్టి యోహో! అవీరులు మనసోదరులు. చిత్రభానుండును, మయూరధ్వజుండును, అన్నా ! చూడుమనిపలికిన నతం డౌను వారలే. తెలిసినది.