పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/348

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మణిమంతునికథ.

337

బడి కొల్లగొట్టింపఁజూతువా! వాని యల్లుఁడు లేకున్న వానిపని యేమగును? ఇది స్త్రీరాజ్యము గావున మీయాటలు సాగుచున్నవి. నీకు మంచి ప్రారశ్చిత్తమైనది. సంతసించితినని రత్న పాదుని నిందించుచు నీతప్పంతయు రత్న మకుటది. నగరములో నేమి యల్లరి జరుగుచున్నదియో తెలిసికొనవలదా? యని రత్నమకుట నాక్నేపించుచు రత్న పాదా! నీవు మొదట మణిమంతు నిల్లు గొల్లగొట్ట బలములఁ బంపుట నీదియే తప్పుగాఁ గనంబడుచున్నది. ఇందుల కేమందువని యడిగిన నతం డిట్లనియె.

దేవా ! నేను అవమానజనితమగు కోపము పట్టఁజాలక యూరక యట్లు చేయుదునని బెదరించితిని కాని మఱియొకటి కాదు. అంత మాత్రమునకే యట్టిహత్యలు గావింపవలయునా ? అయ్యపరాధ పరిశోధనము గావింపరా? అని యడిగిన పుష్ప కేతుఁ డిట్లనియె. సెట్టీ! నీ వూరక వియ్యంకుని బెదరించుటకై పదివేల జనముతో నతనియింటిమీఁదఁ బడితివా ? ఆపెండ్లి పందిళ్ళన్నియు భగ్నముచేయించితి వదియుఁ బరిహాసమే కాఁబోలు! కానిమ్ము. మణిమంతుఁడా ! నీయల్లునికిఁగూడ నాజ్ఞాపత్రిక పంపితిమిగదా. అతం డేమిటికి రాలేదు. బలవంతుఁడనని గరువము కాఁబోలు. అతనివలనఁ గొంతసాక్ష్యము దీసికొనవలసి యున్నది. నీవువోయి యిప్పుడే వెంటఁబెట్టుకొని రమ్ము. పొమ్ము అని పలికి యతండు వచ్చుదనుక నవ్వల నుండుమని రత్న పాదునితోఁ జెప్పి రెండవ యభియోగంబున వాదియగు వ్యాఘ్రముఖ యన్నగారిం బిలిపించి నీవేమి చెప్పెదవు? ప్రతివాది యేమిటికి రా లేదు? అని యడిగిన వాఁడిట్లనియె.

దేవా! వ్యాఘ్రముఖియను వారకాంత నాయక్క కులవృత్తిచేఁ జాల ధన మార్జించినది. మొన్ననొక విటుఁ డెవ్వఁడోవచ్చి దాని కూఁతుఁ గుందమాలను వశముజేసికొని వ్యాఘ్రముఖిని బలవంతము