పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/345

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

334

కాశీమజిలీకథలు - పదియవభాగము.

పుట్టుముహూర్తము లేకున్నను బెట్టుముహూర్త ముండదా? బ్రాహ్మణులకుడబ్బిచ్చినఁ గావలసినన్ని ముహూర్తము లున్నవని చెప్పుదురు. కానిమ్ము. సామగ్రిచెడుననికాదా పెండ్లిచేసితివి. నీసామాగ్రి నీక్రొత్తయల్లుని చుట్టాలతోఁగూడ మట్టుమాపెద నాసామర్థ్యము చూడుము మాకిది చాల లజ్జాకరముగానున్నది. ఇంత ధనముండియు నీచే నవమానింపఁబడితిని. నాకైనవ్యయ మిచ్చుకొందువా ! ఇందులకుఁదగిన ప్రాయశ్చిత్తము నీకుఁ జేయనిచో నాకసితీరదు. నీమర్యాదలుమా కవసరములేదు. పోపొమ్ము. నీయిల్లు కాచికొనుము. నీభాగ్యమంతయుఁ గొల్లగొట్టి మాయింటికిఁ బట్టించుకొనిపోవనిచో నన్నీ పేరఁబిలువవలదు. ఎవ్వరడ్డమువత్తురో చూతముగా. అని మీసములు దువ్వుటయు నే నేమాటయుం బలుకక గిరాలున మరలి యింటికివచ్చి భార్యతో నిట్లంటి.

మన కిప్పుడు గ్రహచారము చాలనట్లున్నది. శుభముచేసికొనినవెంటనే కలహమువచ్చినది. రత్న పాదున కిప్పుడు మనపైఁజాల కోపమువచ్చినది. మనయిల్లంతయుం గొల్లగొట్టి పట్టించుకొనిపోవునఁట. నాలుగువేలమందివీరులు నాఱువేలు నితరులును బదివేలపౌజుతో వచ్చియున్నాడు. వాని నడ్డపెట్టువారెవ్వరు? నేనీవార్త మనరాజ్ఞికిం దెలియఁజేసి సహాయమిమ్మని కోరికొనివచ్చెద నంతదనుక నింటికడ భద్రముగా నుండుఁడు. వెలగల రత్నపుసరకులన్నియు దాచివేయుఁడు. అని దైన్యముతోఁ బలుకుచున్న సమయంబున నామాట విని బంధువులందఱు గగ్గోలుపడఁజొచ్చిరి.

అంతలోమాయల్లుఁ డావార్తవిని మాకడకువచ్చి మీ రేమిటి కిట్లు చింతించుచున్నారని యడిగెను. మేమతనికి రత్న పాదుని యెత్తి కోలంతయుం దెలిపితిమి. అతండు నవ్వుచు నోహో! యిది స్త్రీరాజ్యమా! బలముగలవాఁడే యధికుఁడు కాఁబోలు కాకున్న ద్వీపాం