పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/344

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మణిమంతునికథ.

333

మాయోడలు కొండకుఁదగిలి చిల్లులువడినవి. లోపలికి నీరు చొరబడుచుండ నందలి, సామగ్రి కొంత జలధిలోఁ బడవేసి యెట్లో రంధ్రములు గప్పించి నీరు తోడించి యతిప్రయత్నమున నాలుగుదివసము లకఁ బ్రాణములతో నీవలగట్టునం బడితిమి. అందున్న మాబంధువులు మమ్ము బెద్దగా నాదరించి మావార్త మీకుఁ దెలియఁజేసినట్లు గాఁ జెప్పిరి. ఆమాటపై పెండ్లియాపి మాకొఱకు వేచియుందురని యింతదూరము వచ్చితిమి. మాచావుబ్రదుకులు తెలిసికొనకుండ నీ కూఁతు మఱియొకనికిచ్చి పెండ్లిచేయుట నీకు నీతియా? మఱినాలుగు దివసములైనఁ బరీక్షింపఁగూడదా. మేము మీయింటికి వచ్చుచుఁజిక్కుపడియుంటిమని వినియు విచారింపక వివాహమహోత్సవము జరిపించితివే! నీవెట్టికృతఘ్నుఁడవు. నీవు మానుషజన్మమెత్తలేదా? నీకంటెఁ బశువైన మేలే. ఛీ ఛీ నీమొగము చూడఁగూడదు అని నోరికివచ్చినట్లు ప్రేలుచుండ నే నిట్లంటి.

రత్న పాదా! తొందరపడకుము. నీవు పడరానియాపద పడి యుంటివి కావున నీకినుకకుఁ బ్రత్యుత్తర మీయక సైరించితిని. ఈవల యిబ్బందులుగూడఁ బరికించిన నింతగాఁ దూలనాడవు. మీరౌతులు చెప్పిన మాటలవలన మీరు బ్రతికివత్తురను నాస లేకపోయినది. మఱియొకసుముహూర్తము మూఁడేండ్లవఱకు లేదని దైవజ్ఞులు సెప్పు చున్నారు. వచ్చినబంధువులు నిలువరు. చేసిన సామగ్రి చెడిపోవును. దైవఘటనము లేదని తలంచి వీధింబోయెడివారి కిచ్చితిమి. నీతో సంబంధము కలియనందులకు మాకుఁ జాలవిచారముగానున్నది. దైవము ప్రతికూలుఁడైన మనమేమిచేయగలము ? మీరిచ్చటికి వచ్చి నందులకైన వ్యయమంతయు నిచ్చుకొందును. అలుగకుమని బ్రతిమాలినకొలది వీని కలుక పెఱుగుచుండెను.

మూఢు లిట్లే తప్పులుచేసి దైవముమీఁదఁ బెట్టుచుందురు.