పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/343

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

332

కాశీమజిలీకథలు - పదియవభాగము.

మంగళస్నానములు చేయించి పట్టుపుట్టంబులు గట్టనిచ్చి మాల్యానులేపనాద్యలంకారములచేఁ గైసేసి వివాహవేదికపైఁ గూర్చుండబెట్టిరి. మహావైభవముతో నే ననుకొన్నముహూర్తమునకే నాకూఁతు నాపిల్ల వానికిచ్చి కన్యాదానమహోత్సవము జరిగించితిని. వధూవరు లొండొరులం జూచికొని యానందించుచు మనంబునంగల ముచ్చటలు వెలిబుచ్చుచు విచ్చలవిడి తలఁబ్రాలు పోసికొనిరి.

పెక్కేల నూరేగింపులతో బోగముమేళములతో గానసభలతోఁ గర్ణరసాయనంబులగు తూర్యనాదముల తోఁ బెండ్లి యైదుదినములు నట మహోత్సవముతో వెళ్ళించితిమి. దీక్షావసానదివసంబున వధూవరులం గలిపి సంవర్తనమహోత్సవము గావించితిమి. మహా రాజా ! నేనాయైదుదివసములలో బ్రాహ్మణులకుఁ బీదలకు నితరులకు బంధువులకు జేసిన దానములు చెప్పుకొనరాదుగాని రెండులక్షల కన్న నెక్కువయైనట్లు లెక్కలవలనఁ దెలియఁబడినది.

అట్లుండ నేడవనాఁడు సాయంకాలమున కీరత్న పాదుఁడు బదివేల పౌజులతోఁ బెక్కండ్రు బంధువులతో వచ్చి మావీధి బాహ్యోద్యానవనంబున విడిసినట్లు నాకు వర్తమానమువచ్చినది. నేనావార్త విని గుండె ఝల్లుమన నోహో! సముద్రంబున మునింగివా రెట్లు వచ్చిరి? వచ్చిరిలో నేనిప్పుడేమీ జేయుదును? పెండ్లి యైనదని తిరుగా వర్తమానము బంపుదునా ? అట్లుకాదు. ఇంటికివచ్చినవాని గౌరవించుట న్యాయము. అని తలంచి తగినపరివారమును వెంటఁబెట్టికొని యీరత్న పాదుఁడు విడిసిన చోటికిం బోయి పల్కరించితిని.

అంతకుమున్నె నాకూఁతునకు వివాహమైనదని వినియున్నకతంబున నితండు నన్నుఁజూచి మండిపడుచు నోరీ తులువా! నీవుసంపన్న గృహస్తుండవని దూరమైనను నీసంబంధ మంగీకరించితిని. ఎక్కుడు విభవముతోఁ దరలివచ్చుచుంటి. దైవవశంబున సముద్రమధ్యంబున